Monday, May 26, 2025

తిరుమలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

భక్తులకు ఆరోగ్యశాఖ విస్తృత సేవలు
నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ, తాగునీరు పంపిణీ
శ్రీవారి సేవకుల ద్వారా విశేష సేవలు
జూన్ 2 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మే 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

మన తెలంగాణ / అమరావతి : వేసవి సెలవులతో గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణ గిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టింది. టీటీడీ యంత్రాంగం కృషితో శనివారం 90,211 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది.

మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంతో పాటు ఇతర అన్నదాన కేంద్రాల్లో కలిపి 51 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణ గిరి షెడ్లు, బయట క్యూలైన్లలో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేశారు. మే నుంచి ప్రతిరోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90 వేలకు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నారు. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదే రోజు బయట క్యూలైన్లు, వైకుంఠం ప్రాంతాల్లో 2.72 లక్షల అన్నప్రసాదాలు, 1.17 లక్షల పానీయాలు అందించారు.

భక్తులకు ఆరోగ్యశాఖ విస్తృత సేవలు : క్యూలైన్లలో నిరంతరాయంగా తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, మైస్త్రీలు, ఇన్‌స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలపాటు సేవలు అందిస్తున్నారు. అలాగే తిరుమలలో ప్రతి రోజూ దాదాపు మూడు వేల మంది శ్రీవారి సేవలకు భక్తులకు విస్తృతమైన సేవలను అందిస్తున్నారు. క్యూలైన్ల్లోని భక్తులకు నిరంతరాయంగా నాలుగు షిప్టుల్లో అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలను శ్రీవారి సేవ గ్రూప్ సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజిలెన్స్, ఆలయ విభాగాలు దర్శనం క్యూలైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కల్యాణకట్ట, మెడికల్, రేడియో, రిసెప్షన్ ,బ్రాడ్ కాస్టింగ్ తదితర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి.

జూన్ 2 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 2 నుంచి 10 వరకు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2న ఉదయం – ధ్వజారోహణం , రాత్రి – పెద్దశేష వాహనం, 3న ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం జరుగుతుంది. 4న ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం, 5న ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం, 6న ఉదయం – మోహినీ అవతారం, రాత్రి – గరుడ వాహనం,

7న ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనం, 8న ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం, 9న ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం, 10న ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆలయం పరిసరాలలో ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టారు.

మే 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం : శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 29వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూన్ 2 నుండి 10 వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.

ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News