Sunday, August 10, 2025

సినిమా చర్చలు విఫలం

- Advertisement -
- Advertisement -

నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం
రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాల వారికి ఒకే తీరుగా వేతనాలు పెంచాలని నాయకుల డిమాండ్ 
రూ.2వేల లోపు వేతనం తీసుకునే వారికి దశలవారీగా పెంచడానికి నిర్మాతల ప్రతిపాదన
అంగీకరించని నాయకులు.. రేపటి నుంచి సమ్మె ఉధృతం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆదివారం నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఫెడరేషన్ నాయకులు. నిర్మాతలతో జరిపిన చర్చలు సఫలం కాలేదని ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ వల్లభనేని అనిల్ తెలిపారు. రోజు వారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకేరకమైన వేతనాలు పెంచాల్సిందేనని ఫెడరేషన్ నాయకులు అంటున్నారు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. అంతేకాదు నిర్మాతలు పెట్టిన నాలుగు షరతులకు సైతం అంగీకరించేది లేదని ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ అనిల్ పేర్కొన్నారు.

యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. ఫెడరేషన్‌ను విభజించేలా వేతనాల నిర్ణయం ఉందని వల్లభనేని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శనివారం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సమావేశమై కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. తత్ఫలితంగా సినీ కార్మికులు కోరుకున్న తీరున 30 శాతం వేతనాల పెంపు కాకుండా, విడతల వారీగా 25 శాతం మేర పెంపు ఉంటుంది. ఆ పెంపు కూడా రెండు వేల రూపాయల వేతనం అందుకొనేవారికే వర్తించనుంది. రోజుకు రెండు వేల రూపాయలు తీసుకొనే కార్మికులకు మొదటి సంవత్సరం 15 శాతం వేతన పెంపు జరుపుతామని, తరువాత రెండో సంవత్సరంలో మరో ఐదు శాతం, మూడో సంవత్సరం ఇంకో ఐదు శాతం పెంచుతామని, అలా మొత్తం మూడేళ్ళలో 25 శాతం వేతన పెంపు లభిస్తుందని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సమావేశం అనంతరం ఫిలిమ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు.

ఇదిలా ఉంటే రోజుకు రూ.1000 వేతనం అందుకొనే కార్మికులకు మొదటి సంవత్సరం 20 శాతం పెంపు, రెండో సంవత్సరం ఏమీ ఉండదని, మూడో సంవత్సరం ఐదు శాతం పెంపు లభిస్తుందన్నారు. దీంతో వారికి సైతం 25 శాతం వేతనం పెంపు ఉంటుంది. అయితే చిన్న సినిమాలకు ఎలాంటి పెంపు ఉండబోదనీ స్పష్టం చేశారు దామోదర ప్రసాద్. మరి ఏ బడ్జెట్ లోపు సినిమా నిర్మిస్తే దానిని చిన్న చిత్రంగా పరిగణిస్తారు అన్న ప్రశ్నకు ఆ విషయంపై నిర్మాతలందరూ చర్చించాక ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పెంపుదల కూడా తాము పెట్టిన నాలుగు షరతులకు ఫిల్మ్ ఫెడరేషన్ వారు అంగీకరిస్తేనే అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే నిర్మాతలు పెట్టిన నాలుగు షరతులకు అంగీకరించేది లేదని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News