మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఈ నెల 15వ తేదీలోగా నియమించేందుకు కృషి చేస్తున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా పార్టీ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకే జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్లు ఆయన మంగళవారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల కమిటీలను పూర్తి స్థాయిలో నియామకం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలన్నది తమ ఆలోచన అని ఆయన చెప్పారు. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణలో ఉంది కాబట్టి తాను ఇప్పుడేమీ మాట్లాడలేనని అన్నారు.
తీన్మార్ మల్లన్న కులగణన పత్రాలు తగులబెట్టిన అంశం, అనిరుధ్ రెడ్డి మాట్లాడిన అంశం వేర్వేరు అని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మాట్లాడుతున్నారని, నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లైవ్‌లో ఉందన్నారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నామని, దీంతో మహిఃళల సీట్లూ పెరుగుతాయన ఆయన చెప్పారు. మంత్రి పదవుల అంశం తన పరిథిలో లేదని, రాజకీయాల్లో ఒక్కోసారి జూనియర్లకు ముందుగా అవకాశాలు లభిస్తుంటాయని ఆయన తెలిపారు. సీనియర్లకు తమ పార్టీలో గౌరవం ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. పది మంది సమర్థులైన అభ్యర్థులు తమకు ఉన్నందున, ఇక ఇతర పార్టీల నుంచి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.