Friday, August 29, 2025

భారత వాణిజ్యానికి ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ

- Advertisement -
- Advertisement -

భారత ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన మొత్తం 50% సుంకాలు బుధవారం (ఆగస్టు 27) నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న సాకుతో భారత ఎగుమతులపై అమెరికా ప్రకటించిన 25 శాతం అదనపు సుంకాలతోపాటు ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలు మొత్తం 50 శాతం సుంకాల భారం మన ఎగుమతులపై పడింది. దీనివల్ల 47 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఉత్పత్తులు 50 శాతం టారిఫ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల అమెరికా మార్కెట్లో చాలా వరకు భారతీయ ఉత్పత్తులకు చోటులేకుండా పోతుందన్న ఆందోళన వాణిజ్యరంగంలో ఎక్కువగా ఉంటోంది. మనకన్నా తక్కువ సుంకాలు వర్తించే బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కాంబోడియా, ఇండోనేషియా వంటి దేశాలతో పోటీపడే పరిస్థితి ఉండకపోవచ్చు.

భారత్‌పై విధించిన సుంకాల కన్నా చైనా (30 శాతం), వియత్నాం (20 శాతం). ఇండోనేషియా (19 శాతం), జపాన్ (19 శాతం) దేశాలకు సుంకాల భారం తక్కువ. అదనపు సుంకాల భారంతో 202526లో అమెరికాకు భారత ఎగుమతులు రూ. 4.34 లక్షల కోట్ల అంటే 49.6 బిలియన్ డాలర్ల మేరకు పడిపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనీషియేటివ్ (జిటిఆర్‌ఐ) సంస్థ అంచనాగా వెల్లడించింది. 2024 2025లో భారత్ అమెరికా మధ్య సుమారు 11.5 లక్షల కోట్ల (131.8 బిలియన్ డాలర్ల) వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ నుంచి రూ.7.57 లక్షల కోట్ల (86.5 బిలియన్ డాలర్ల) ఎగుమతులు జరగ్గా, రూ. 4 లక్షల కోట్ల (45.3 బిలియన్ డాలర్ల) మేర దిగుమతులు జరిగాయి.

ప్రస్తుతం 50% టారిఫ్‌లతో భారత్ నుంచి జరిగే రూ. 5.25 లక్షల కోట్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అధిక సుంకాల కారణంగా అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు ఏకంగా 50 శాతం పెరిగిపోతాయి. గత ఏడాది భారత్ నుంచి ఎగుమతులు 91.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కానీ ఈసారి అమెరికాకు 60 శాతం ఎగుమతులపై అంటే దాదాపు 60.2 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుపై ప్రభావం పడుతుందని వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే త్వరలో రాబోయే జిఎస్‌టి సంస్కరణలు ఈ టారిఫ్‌ల ప్రభావాన్ని భర్తీ చేయవచ్చని పిచ్ సొల్యూషన్స్ కంపెనీ బిఎంఐ గురువారం వెల్లడించింది. సుంకాలతో కొన్ని రంగాలు దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ భారత జిడిపి వృద్ధిరేటు మాత్రం 6% పైనే ఉంటుందని బిఎంఐ అంచనా వేసింది.

మన ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఇటువంటి చర్యలకు దిగుతోందని ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అభిప్రాయపడింది. ఏదేమైనా మన దేశంలోని రొయ్యలు, మత్స పరిశ్రమ, పాడి పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, దుస్తులు, కార్పెట్లు, హస్తకళా ఖండాలు, తోలు, పాదరక్షలు తదితర చేతివృత్తులకు కూడా విపరీతమైన నష్టం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 2.4 బిలియన్ల విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి. మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 32.4% అమెరికాకు ఎగుమతి అవుతోంది.

ప్రధానంగా విశాఖ పట్టణం కేంద్రంగా తూర్పు తీరప్రాంతాల నుంచి అమెరికాకు సుమారు రూ. 20 వేల కోట్లకు పైగా విలువైన రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికాకు 10 బిలియన్ డాలర్ల రత్నాలు, ఆభరణాలు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఇందులో సగానికి సగం తగ్గిపోవచ్చు. ముంబై, సూరత్ వేదికగా ఉన్న రత్నాలు, ఆభరణాల పరిశ్రమల నుంచి రూ. 87వేల కోట్ల విలువైన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 10.8 బిలియన్ల విలువైన వస్త్రాలు, దుస్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. భారత దేశ దుస్తుల ఎగుమతుల్లో అమెరికా వాటా 35 శాతంగా ఉంటోంది. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటకల నుంచి ఎగుమతి అయ్యే రూ. 95 వేల కోట్ల వస్త్రాల ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉంది.

సుంకాలు 13.9 శాతం నుంచి 63.9 శాతానికి పెరగడంతో తిరుప్పూర్, నోయిడాగురుగ్రామ్, బెంగళూరు, లూథియానా, జైపూర్‌ల్లో వస్త్రపరిశ్రమలపై తీవ్రప్రభావం పడుతుంది. తిరుప్పూర్, నోయిడా, సూరత్‌లోని దుస్తుల తయారీ సంస్థలు అప్పుడే ఉత్పత్తిని నిలిపివేశాయి. 2025లో అమెరికాకు భారత్ నుంచి 1.2 బిలియన్ల విలువైన కార్పెట్లు ఎగుమతి అయ్యాయి. అమెరికాలో భారత్ కార్పెట్ల ఎగుమతులు 58.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీనివల్ల మీర్జాపూర్, శ్రీనగర్‌ల్లో చేతివృత్తులకు ముప్పు తప్పదు. హస్తకళల ఉత్పత్తులు అమెరికాకు దాదాపు 40 శాతం ఎగుమతి అవుతుంటాయి. 2025లో అమెరికాకు 1.6 బిలియన్ డాలర్ల విలువైన హస్తకళల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.

జోథ్‌పూర్, జైపూర్, మురాదాబాద్, సహారన్‌పూర్‌ల్లోని హస్తకళల పరిశ్రమలకు నష్టం కలుగుతుంది. అమెరికాకు భారత్ నుండి దాదాపు 1.2 బిలియన్ డాలర్ల విలువైన తోలు, పాదరక్షల ఎగుమతులు అవుతుంటాయి. ఇప్పుడు ఆగ్రా, కాన్పూర్, తమిళనాడులోని అంబూర్ రాణిపేట్ పరిశ్రమలు దెబ్బతింటాయి. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ)పై స్పష్టత వచ్చేవరకు ఉత్పత్తిని నిలిపివేస్తామని, సిబ్బందిని తగ్గించుకుంటామని తోలు, పాదరక్షల పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారతదేశం నుంచి 6 బిలియన్ డాలర్ల విలువైన బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఈ ఎగుమతులు సగానికి సగం తగ్గిపోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్, థాయ్‌లాండ్, వియత్నాం, కెన్యా, శ్రీలంక, అమెరికా డిమాండ్లను చేజిక్కించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News