భారతీయ రైల్వే దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 1,32,310 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా 8,000కు పైగా రైల్వేస్టేషన్లు కలిగి ఉన్న మన రైల్వే వ్యవస్థ ద్వారా ప్రతి రోజూ సగటున 2.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ అయిన భారతీయ రైల్వే ఇటీవలి కాలంలో సాంకేతికంగా కొత్తపుంతలు తొక్కుతోంది. దేశంలోని వందలాది రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేయడంతోపాటు వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. మరోవైపు ప్రమాదాల నివారణ కోసం కవచ్ వ్యవస్థను అన్ని రైళ్లలోనూ ప్రవేశపెడుతోంది.
ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ప్రయాణికులు, రైళ్ల భద్రతను మాత్రం ఇటీవలి కాలంలో గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. గతంలో రైల్వేకు ప్రత్యేకంగా (Formerly exclusive Railways) ఒక బడ్జెట్, పూర్థిస్థాయి కేబినెట్ మంత్రి ఉండేవారు. హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల తర్వాత రైల్వే శాఖకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. అయితే మోడీ హయాంలో అంతా మారిపోయింది. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర సాధారణ బడ్జెట్‌లో భాగం చేసేశారు. అలాగే పూర్తిస్థాయి మంత్రి కూడా లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైల్వే శాఖ వ్యవహారాలు చూస్తున్న అశ్వినీ వైష్ణవ్‌కు ఆ శాఖతోపాటు ఐటి వ్యవహారాలు కూడా అప్పగించారు. ఫలితంగా ఆయన రైల్వే వ్యవహారాలపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగులుండే రైల్వే శాఖలో ఒక విధమైన నిర్లక్ష ధోరణి క్రమంగా వ్యాపిస్తోంది. నిత్యం ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
అనేక సందర్భాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగానే ఉంటోంది. ఇందుకు తాజాగా జరిగిన రెండు ప్రమాదాలే నిదర్శనం.ఆదివారం నాడు తమిళనాడులోని తిరువళ్లూర్ రైల్వే స్టేషన్ వద్ద డీజిల్ లోడుతో వెళుతున్న గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో వ్యాగన్లలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా ఆస్తి నష్ట సంభవించింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు కానీ కోట్లాది రూపాయల డీజిల్ అగ్నికి ఆహుతి అయింది. సోమవారం తిరుపతి రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదం అందర్నీ విస్తుపోయేలా చేసింది. లూప్‌లైన్‌లో ఆగి ఉన్న రాయలసీమ, షిర్డీ రైళ్ల బోగీల్లో ఒక్కసారి ఉవ్వెత్తున మంటలు ఎగసిపడి బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు కానీ ఈ ఘటన జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఖాళీగా ఉన్న రైలు బోగీల్లో మంటలు ఎలా చెలరేగాయి? ఇది సాంకేతిక లోపమా లేక ఆకతాయిలు ఎవరైనా చేసిన పనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం ముంబైలో లోకల్ రైళ్లనుంచి జారిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రద్దీ సమయంలో వేలాడుతూ ప్రయాణిస్తున్న వారిని ఎదురుగా వస్తున్న మరో లోకల్ రైలు ప్రయాణికులు తగలడంతో ఎనిమిది మంది జారిపడగా నలుగురు విగత జీవులుగా మిగిలారు. ఈ ఘటన తర్వాత ముంబైలో అన్ని లోకల్ రైళ్లకు తలుపులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏదిఏమయినా ఈ ప్రమాదాలు అన్నీ రైల్వేలో భద్రతా వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో రైళ్లలో దోపిడీలతోపాటుగా అత్యాచారాలు కూడా జరిగిపోతున్నాయి. ఖాళీగా ఉన్న రైలు బోగీలో సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆ మహిళను కిందికి తోసేయడంతో రెండు కాళ్లూ కోల్పోయిన ఘటన వారం రోజుల క్రితం హర్యానాలోని పానిపట్‌లో చోటుచేసుకుంది.
ఇక రైళ్లుపట్టాలు తప్పడం లాంటి ఘటనలు రోజూ మామూలైపోయాయి. ఇవన్నీ వ్యవస్థలో భద్రతా వైఫల్యాలకు నిదర్శనాలు. ఈ కారణంగానే అన్ని రైలు బోగీల్లో సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మధ్య, దిగువ ఆదాయ వర్గాల పట్ల రైల్వే శాఖ చిన్నచూపు చర్చనీయాంశంగా మారింది. రైళ్లలో ప్రయాణించే వారంతా సంపన్నులు కాదు. సగానికి పైగా సాధారణ ప్రజలే. వీరంతా మామూలుగా జనరల్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి రైలులోను ఈ బోగీల సంఖ్యను గణనీయంగా తగ్గించివేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇక ప్యాసింజర్ రైళ్లయితే కనిపించడమే మానేశాయి.
ఫలితంగా తక్కువ దూరాలకు ప్రయాణించే వారు విధిలేక ఎక్కువ చార్జీ చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే అనేది ప్రజాహితంకోసం నడిచే వ్యవస్థ తప్ప ఆదాయం కోసం కాదనే వాస్తవాన్ని పాలకులు క్రమంగా మరిచిపోతున్నారు. ఫలితంగా ఎంతగా అభివృద్ధి చెందినా రైలు ప్రయాణం సామాన్యుడికి అందని మానిపండుగానే మారిపోతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేదంటే దేశానికే తలమానికమయిన రైల్వేవ్యవస్థ క్రమంగా ప్రభుత్వం చేతుల్లోంచి జారిపోయి ప్రైవేటుపరం కావడం ఖాయం. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి కూడా.