నాణ్యమైన బోధనకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 1,13,942 ఉపాధ్యాయులు, 5,605 రిసోర్స్ పర్సన్లకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులను ప్రభుత్వం నిర్వహించింది. ఉపాధ్యాయుల నియామకం… హేతుబద్దమైన బదిలీల విధానంతో ఈ ఏడాది 41 నూతన పాఠశాలలను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో 1565 మంది విద్యార్థులు చేరారు. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డిఎస్‌సి రాయాలంటే తొలుత ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి 2014 వరకు నాలుగుసార్లు టెట్ నిర్వహించగా, గత బిఆర్‌ఎస్ ప్రభత్వ పదేళ్ల కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే టెట్ నిర్వహించింది.
2018 నుంచి 2021వరకు వరుసగా నాలుగేళ్లు టెట్‌ను గత ప్రభుత్వం నిర్వహించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ సమయంలో టెట్ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో వెంటనే టెట్ నిర్వహించాలని ఆదేశించారు. 2024 మే, జూన్ నెలల్లో టెట్ నిర్వహించగా రెండు పేపర్లకు కలిపి 2,36,487 మంది రాశారు. 2024 డిసెంబరు, 2025 జూన్ నెలలోనూ టెట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇది ఉపాధ్యాయ బోధన విద్య పూర్తి చేసిన వారికి ఎంతో ఊరట కలిగించింది.