తెలుగు సాహిత్య లోకంలో ఒక ధిక్కా ర స్వరం మూగబోయింది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు, ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని, ర చయిత్రి, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత గుండెపోటుతో ఆగస్టు 11, 2025న వరంగ ల్‌లో మనలను శాశ్వతంగా విడిచిపోయారు. ఆమె లేని లోటు కేవలం ఒక వ్యక్తి నష్టం మా త్రమే కాదు, తెలంగాణ సాహిత్యం, ఉద్యమాలకు, స్త్రీవాద భావనలకు తీరని లోటు. రజిత జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. శ్రమజీవుల పక్షాన నిలిచి, అణచివేతలకు వ్యతిరేకంగా కలంపట్టిన యోధురాలు ఆమె. ఆమె రచన లు సామాజిక అసమానతలను ప్రశ్నిస్తాయి. పోరాడమని పిలుపునిస్తాయి.అనిశెట్టి రజిత 1958 ఏప్రిల్ 14న వరంగల్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆమె తెలంగాణ ఉద్యమం నుండి ప్రభావితురాలు అయ్యారు. దాశరథి, ఆరుద్ర వంటి రచయితల ఉపన్యాసాలకు ఆకర్షితురాలయ్యారు. 1969లోనే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె జీవితం ఉద్యమం, సాహి త్యం మధ్య సమన్వయంతో సాగింది. ఒక చేత్తో ఉద్యమ జెండా, మరో చేత్తో కవిత్వ పతాక చేపట్టింది రజిత.
అనిశెట్టి రజిత రచనలు సామాజిక య థార్థాలను స్పృశిస్తాయి. ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ ఉద్యమ అనుభవాల నుంచి జన్మించింది. అందులో తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు ప్రతిధ్వనిస్తాయి. ‘నేనొక నల్లమబ్బునవు తా’ స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో రూపుదిద్దుకుంది. మహిళల అణచివేతలను విమర్శిస్తుం ది. ‘చెమట చెట్టు’, ‘ఓ లచ్చవ్వ’, ‘ఉసురు’, ‘గోరంత దీపాలు’, ‘దస్తఖత్’, ‘అనగనగా కాలం’, ‘మట్టి బంధం’, ‘నన్హే ఓ నన్హే’, ‘మార్కెట్ స్మార్ట్ శ్రీమతి’, ‘నిర్భయాకాశం కింద’ వంటి సంపుటాలు ఆమె సాహిత్య పిపాసను చాటుతాయి. హైకూల సంపుటి, ఆచార్య పాకాల యశోదారెడ్డిపై మోనాగ్రాఫ్ కూడా ఆమె రాశారు. మొత్తం 500కి పైగా కవితలు, 100కి పైగా వ్యాసాలు, 30కి పైగా పాటలు రచించారు. ఆమె సాహిత్యం కేవలం కళాత్మ కం కాదు, సామాజిక మార్పునకు సాధనం. స్త్రీవాదం, దళిత ఉద్యమాలు, తెలంగాణ గొంతుకలు ఆమె రచనల్లో మిళితమవుతాయి.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రర వే) జాతీయ అధ్యక్షురాలిగా, సాహిత్య సమావేశాల్లో ఆమె మాటలు యువ రచయితలకు ప్రేరణ ఇస్తాయి. ఆమె సాహిత్యం మట్టి బం ధం లాంటిది. సమాజం పట్ల బాధ్యతాయుత మైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు.
2014లో తెలు గు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, 2016లో అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని రజిత అందుకున్నారు. ఆమె రచనల్లో స్త్రీ వాదం ప్రబలంగా కనిపిస్తుంది. ఆమె సాహి త్యం మానవత్వాన్ని ఉద్దీప్తం చేస్తుంది. పీడితు ల పక్షాన నిలిచి, సమానత్వం కోసం పోరాడుతుంది. రజిత మానవత్వం ఆమె చర్యల్లో ప్రతిఫలిస్తుంది. గతేడాది శరీర దానం చేయాలని నిర్ణయించుకున్నారు ఆమె. మరణానంతరం నేత్రదానం చేసి, భౌతికకాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఇది ఆమె సదాశయానికి నిదర్శనం. ఆమె రచనలు కేవలం పదాలు కావు, జీవిత దర్శనం. ‘ఆఖరి మగాడు’లో: ‘మేము ఊరుకోము, మనుస్మృతుల అగ్నికీలల్లో కాలం.. కదం తొక్కుతాం / ఈ యుద్ధంలో సమిధలై/ ఆఖరి మొగాళ్లుగా.. నిలుస్తారో మీ ఇష్టం!/ఆడవాళ్ళు పువ్వులే కాదు అగ్నిశిఖలని మరువకండి!’. ఇలా స్త్రీల ను అగ్నిశిఖలుగా చిత్రీకరిస్తూ, మార్పునకు పిలుపునిస్తుంది. ఆమె సాహిత్యం సమకాలీన సమస్యలను స్పృశిస్తుంది. లింగ అసమానత లు, వర్గ భేదాలు, పర్యావరణం వంటి అంశాలపై రాశారు.
రజిత సాహిత్యం నిండా మహిళలు, ప్ర జల పక్షం వహించడం చూస్తాం. జీవితాన్ని మార్చే ఆయుధం, స్త్రీవాద ఉద్యమంలో ఆమె రచనలు మహిళల చైతన్యాన్ని పెంచాయి. సామాజిక కార్యకర్తగా తోటి మనుషుల బాధల్లో తనను తాను చూసుకునేది. ‘నేను అనంతమయిని’లో ‘నన్ను గుప్పిట బంధించాలని చూడకు/ అదృశ్య రూపంలో ఉన్న అనంతమయిని/ పుష్ప వికాసాన్నే కాదు/ విశ్వప్రళయాన్నీ చూస్తావు’. ఇది స్త్రీ శక్తిని అనంతం గా చూపిస్తుంది. అనిశెట్టి రజిత మరణం తెలు గు సాహితీ లోకాన్ని దుఃఖసాగరంలో ముం చింది. ఆమె రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు.
డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్