Saturday, August 2, 2025

ఐక్య ప్రతిఘటనే మార్గం

- Advertisement -
- Advertisement -

ట్రంప్‌తో కౌగిలింతల వల్ల భ్రమలు తప్ప నికరమైన ప్రయోజనం ఏమీ లేకపోయిందన్నమాట. టారిఫ్‌ల విషయమై భారతదేశంతో ఒకవైపు చర్చలు ఇంకా జరుగుతండగానే, తమ వైపు నుంచి 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించివేసారు. తమతో ఒప్పందాలు చేసుకోవటానికి ప్రపంచ దేశాలకు ఆయన విధించిన 90 రోజుల గడువు నేడు (ఆగస్టు 1) ముగియవలసి ఉంది. తను గడువు విధించింది ఏప్రిల్ 2న. మిగిలిన దేశాల విషయం కొద్ది సేపు అట్లుంచితే, భారత ప్రభుత్వం వెంటనే చర్చలకు సంసిద్ధత ప్రకటించింది. వాణిజ్య మంత్రి పీయూస్ గోయెల్, ఆయన శాఖ అధికారులు పలుమార్లు వాషింగ్టన్ వెళ్లి అమెరికా అధికారులతో చర్చలు జరిపారు. గడుపు సమీపిస్తుండగా గత వారం రోజులలో వచ్చిన వార్తలను బట్టి, పలు అంశాలపై అంగీకారం కుదరగా, వ్యవసాయోత్పత్తులు, పాడి ఉత్పత్తుల వంటివి కొన్ని ఇంకా మిగిలిఉన్నాయి.

ఆ చర్చలు ముగిసేలోగా, ఇప్పటికే అంగీకారం కుదిరిన వాటితో మొదట ఒక ‘మినీ ఒప్పందం’ ప్రకటించగలరని ట్రంప్ కూడా అటువంటి సూచనలు చేసారు. కాని, ఇంతలోనే అకస్మాత్తుగా అన్ని విధాలైన ఉత్పత్తులపై 25 శాతం సుంకమని ప్రకటించారు. దీనిపై భారత ప్రభుత్వ స్పందన (Government India response) ఈ వ్యాసం రాసే సమయానికి పూర్తి వివరాలతో ఇంకా తెలియవలసి ఉంది గాని, ట్రంప్ నిర్ణయం తప్పక ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. అయితే, ఎపుడు ఏమి చేస్తారో, తిరిగి ఏమాట ఎపుడు మార్చుకుంటారో తెలియదనే పేరు అమెరికా అధ్యక్షునికి టారిఫ్‌లే గాక అన్ని విషయాలలో ఇప్పటికే కలిగింది గనుక, ఈ విషయంలోనూ రానున్న రోజులలో మార్పు ఏమైనా ఉంటుందేమో చూడాలి. లేదా, అన్ని సరకులపై 25 శాతమన్నది చాలా ఎక్కువ గనుక, ఇది ఇండియాను ఒత్తిడి చేసేందుకు ఉద్దేశించిన ఎత్తుగడ అయినా కావచ్చు.

ట్రంప్ మొదట అన్ని దేశాలపై మూకుమ్మడిగా సుంకాల హెచ్చింపును ప్రకటించినపుడు ఆస్థాయి వేర్వేరు దేశాలపై వేర్వేరు విధాలుగా ఉంది. 20 శాతం, 30 శాతం నుంచి మొదలుకొని, అత్యధికంగా చైనాపై 245 శాతం వరకు వెళ్లి, అంతలోనే 145 శాతానికి తగ్గారు. చర్చల క్రమంలో అందరిపైనా మార్పులు ఉండవచ్చునని సూచిస్తూ, ఏ మార్పులు ఏట్లున్నా బేసిక్ హెచ్చింపులు మాత్రం 10 శాతమని, అంతకన్న ఎవరికీ తగ్గింపు ఉండదని ప్రకటించారు. దానిని బట్టి, అమెరికాకు ఇండియా “మిత్ర” దేశం అయినందున, బహుశా మనకు 10 శాతానికి లేదా 15 శాతానికి పరిమితం కావచ్చునన్న ఆశాభావాలు ఉండేవి. కాని, మిత్రత్వానికి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధం లేదని ట్రంప్ ఇపుడు తేల్చి చెప్పారు. అయినా, భారతదేశం కన్న అతి సన్నిహితం, నాటో సైనిక కూటమిలోనూ భాగస్వాములు అయిన యూరోపియన్ యూనియన్, కెనడాలనే మినహాయించని ట్రంప్ మనకు ఏవో మినహాయింపులు ఇవ్వవచ్చుననే ఆశాభావమే ఒక దురాశ అనాలి.

అప్పటికీ ఎవరికి ఏవైనా భ్రమలు ఉంటే, ఈ ప్రకటనతో తీరిపోయి ఉండాలి.  ట్రంప్ చెప్పిన మాటలను ఒకసారి యథాతథంగా గమనించండి: “ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇండియా మాకు మిత్రదేశమే అయినా ఇరువరి మధ్య గల వాణిజ్యం స్వల్పమే. అందుకు కారణం ఇతర దేశాల నుంచి దిగుమతిలపై వారి సుంకాలు చాలా ఎక్కువ. ప్రపంచంలోనే ఎక్కువ సుంకాలు వేసే దేశాలలో ఇండియా ఒకటి. అంతేగాక, సుంకాలతో సంబంధం లేకుండా రకరకాల దిగుమతి ఆంక్షలు విపరీతంగా ఉంటాయి. అదిగాక, తమ ఆయుధాలలో ఎక్కువభాగం రష్యా నుంచి ఖరీదు చేస్తారు. చమురును రష్యా నుంచి భారీగా ఖరీదు చేసే రెండు దేశాలలో చైనాతోపాటు ఇండియా కూడా ఉంది. ఇదంతా, ఉక్రెయిన్‌లో హత్యాకాండ ఆగాలని అందరూ భావిస్తున్న సమయంలో జరుగుతున్నది. ఇవేవీ మంచి పనుల కావు.

అందువల్ల భారతదేశం ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు చెల్లిస్తుంది. అదిగాక, రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీలు కూడా ఉంటాయి’. విశేషం ఏమంటే, ఇండియా అమెరికా కలిసి శ్రీహరికోట నుంచి ఒక ముఖ్యమైన ఉపగ్రహాన్ని ప్రయోగించిన రోజునే ట్రంప్ ప్రకటన వార్తలు వెలువడ్డాయి. ట్రంప్ ఈ విధమైన చర్యలపట్ల ఆశ్చర్యం కలగటం ఎప్పుడో ఆగిపోయింది గనుక ఈవిషయం వదలివేద్దాం. ఇతరత్రా ఆయన ప్రకటనను పరిశీలించినపుడు కొన్ని విషయాలు దృష్టికి వస్తాయి. ఏదేశం ఏమేర సుంకాలు విధిస్తుందన్నది వారి ఆర్థిక పరిస్థితులు, విధానాలపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా దిగుమతి ఆంక్షల విషయం. అమెరికా వంటివి గణనీయంగా అభివృద్ధి చెందిన దేశాలు కాగా, ఇండియా మొదలైనవి వందల సంవత్సరాల పాటు వలస పాలనలకు, నయా వలసవాదానికి గురవుతూ వెనుకబడినటువంటివి. వారు ఏమేర సుంకాలు, ఆంక్షలు విధించినా అమెరికాకు వారికి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు దశాబ్దాల తర్వాత కూడా అదే విధంగా ఉన్నాయి.

సుంకాలు, ఆంక్షలతో ఒక మేరకైనా ఆత్మరక్షణ చేసుకోని పక్షంలో వర్ధమాన దేశాల వనరులు, మార్కెట్లు వలసలు కాలంలో వలెనే ధనిక రాజ్యాల గుప్పిటిలో ఉండిపోయి, ఇండియా వంటివి నెమ్మదిగానైనా ముందుకు పోగల అవకాశాలు శూన్యమవుతాయి. కాని అమెరికా అధ్యక్షునికి ఈ పరిస్థితులతో నిమిత్తం లేదు. కొన్ని స్వయంకృతాపరాధాల వల్ల తమ ఆర్థిక వ్యవస్థ ఇటీవల బలహీనపడుతుండటంతో, ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఆయన వర్ధమాన దేశాలను, మొత్తం అన్నిదేశాలను శిక్షించదలచుకున్నారు. బయటకు ప్రచారంలో లేని విషయం మరొకటి ఉంది. ట్రంప్ ఎంత సేపూ ముడి వనరులు, సరకుల ఎగుమతి దిగుమతుల గురించి మాట్లాడుతున్నారు. పాశ్చాత్య మీడియా బలమైనది, వర్ధమాన దేశాల మీడియా బలహీనమైనది గనుక దానికే ప్రచారం లభిస్తున్నది. అది తప్ప ఇతర విషయాలు లేవనే భావన ప్రజలకు కలుగుతున్నది. కాని, వివిధ సర్వీసుల రంగంలో అమెరికాది ఇంచుమించు ఏకచ్ఛత్రాధిపత్యం.

వాటిపై సుంకాల ఆదాయమంతా వారిదే. ఈ వందల బిలియన్ల డాలర్ల గురించి ట్రంప్ మాట్లాడరు. అంతేకాదు. వ్యవసాయ రంగానికి ఇండియా తదితర వర్ధమాన దేశాలు ఇచ్చే సబ్సిడీలను వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చేయాలని, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఆయా దేశాల మార్కెట్లులోకి స్వేచ్ఛగా ప్రవేశించే అనుమతి ఉండాలని పట్టుపడతారు గాని, తాము స్వయంగా అక్కడ వ్యవసాయ పాడి రంగాలకు ఇచ్చే సబ్సిడీల గురించి మాట్లాడరు. వాస్తవానికి ఈ సబ్సిడీలపై వాదసంవాదాలు గత మూడు దశాబ్దాలుగా సాగుతున్నాయి.అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కారుచవకగా తమ మార్కెట్లను ముంచెత్తితే, తమ రైతాంగం ధ్వంసమవుతుందన్నది ఈ దేశాల వాదన. అయినప్పటికీ నేటికీ ట్రంప్ అదే పట్టుదలపై ఉన్నారు. 30వ తేదీ రాత్రి పొద్దుపోయి అందుతున్న వార్తలను బట్టి, అమెరికా ఇండియా టారిఫ్ చర్చలలో ఈ విషయ తేలలేదు గనుకనే ఒప్పందం కొలిక్కి రావటం లేదని అర్థమవుతున్నది.

ఇతరత్రా అనేక పారిశ్రామిక ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించేందుకు ఇండియా అంగీకరించింది. అమెరికానుంచి దిగుమతులపై ఆంక్షలు సడలించింది. కూడా. పైన పేర్కొన్న ట్రంప్ ప్రకటనలో రష్యా నుండి ఆయుధాలు, చమురు కొనుగోలు, ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావనలు ఉన్నాయి. ఈ నిందలు గతంనుంచి ఉన్నవే. అందుకు సరైన సమాధానాలు కూడా ఉన్నవే. ఆయుధాలను స్వీయ రక్షణకోసం అవసరమైన చోట ఖరీదు చేస్తా రు. అయినా ఇటీవల రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గాయి కూడా. ఇంధనమూ అంతే. రష్యా నుంచి స్వయంగా యూరప్ ఖరీదు చేస్తూనే ఉంది. ఆ మాట ఏమిటన్న భారత ప్రశ్నలకు అటునుంచి సమాధానం లేదు. ఉక్రెయిన్ గురించి మాట్లాడే ట్రంప్ గాజా మారణకాండపై ఎన్నడూ నోరుమెదపలేదు. ఈ విధంగా అన్ని విషయాలలో ద్వంద్వ నీతిని సాగించే అమెరికా తన ప్రయోజనాల కోసం, తమ ఆర్థిక బలాన్ని, మార్కెట్ బలాన్ని ఆధారం చేసుకుంటూ ఇతరులపై దాదాగిరీ చేయటమన్నమాట.

ఇండియాను లొంగదీసి మనం విధించే సుంకాలను వీలైతే సున్నా శాతానికి తగ్గేట్లు చూసి, తమ సుంకాలు మాత్రం యధావిధిగా కొనసాగించటం ట్రంప్ లక్షం. ఇప్పటికే కొన్ని దేశాలపై అట్లా చేసారు. ట్రంప్ ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద భారానికి దారి తీయగలదన్నది స్పష్టంగా కనిసిస్తున్నదే.అందుకు స్పందించిన ప్రభుత్వం దేశప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోగలమన్నది గాని, అది అంత తేలిక కాదు. అదే సమయంలో, కీలెరిగి వాత పెట్టటం అవసరం. వర్ధమాన దేశాలు, బ్రిక్ దేశాలు సత్వరమే సంప్రదింపులు జరిపి, లోగడ గాట్ చర్చలు, డబ్లుటిఒ చర్చల కాలంలోవలే ఒక సంఘటనగా ఏర్పడి ప్రతిఘటించటం ఒక్కటే మిగిలిన మార్గం. అంతేకాదు. డబ్లుటిఒను తమకు ఉపయోగపడినంత కాలం వాడుకుని ఇపుడు ఏకపక్ష విధానాల ద్వారా భంగపరచి, ఏకచ్ఛత్రాధిపత్యం సాగించజూస్తున్న అమెరికా ధోరణికి ఆ విధంగా అడ్డుకట్ట వేయటం కూడా అవసరమవుతున్నది. అందువల్ల భారత ప్రభుత్వం కూడా ప్రేమదోబూచులు మానివేసి ఇతర వర్ధమాన దేశాలతో కలిసి పనిచేయటమే మిగిలిన మార్గం.

  • టంకశాల అశోక్ (దూరదృష్టి)
  • రచయిత సీనియర్ సంపాదకులు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News