Tuesday, July 1, 2025

వర్శిటీలనూ వదలని ట్రంప్

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టడం కన్నా తన మాట వినని వారిని ఎలా లొంగదీసుకోవాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ట్రేడ్ వార్ పేరుతో కెనడా, చైనా వంటి దేశాలను లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన ట్రంప్ చివరికి తన మాట వినని విద్యాసంస్థలను కూడా వదలి పెట్టడంలేదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్శిటీల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ఆయన ప్రకటించిన యుద్ధమే దీనికి ఉదాహరణ. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే నియామక పద్ధతుల ప్రవేశ విధానల్లో మార్పులు చేయాలని, ఫేస్‌మాస్క్‌లను నిషేధించాలని ట్రంప్ సర్కార్ గతంలో నిబంధనలు జారీ చేసింది.

దీనిపై స్పందించిన హార్వర్డ్ వర్శిటీ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఏ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించాలి, ఎవరిని చేర్చుకోవాలి, నియమించుకోవాలి లేదా ఏరంగాలను ఎంచుకోవాలో నిర్దేశించకూడదని స్పష్టం చేశారు. హార్వర్డ్ ధిక్కారాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ సర్కార్ విశ్వవిద్యాలయానికి అందించే 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను గత వారం స్తంభింపజేసింది. అంతేకాకుండా వర్శిటీకి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల ఫెడరల్ కాంట్రాక్ట్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వైద్య పరిశోధనల కోసం వర్శిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు, కాంట్రాక్టులను మరో బిలియన్ డాలర్ల మేర తగ్గించాలని కూడా ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనితో హార్వర్డ్ వర్శిటీ అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

నిధులను నిలిపివేయడం ద్వారా సంస్థ విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్ సర్కార్ యత్నిస్తోందని మసాచుసెట్స్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. అంతేకాకుండా ఇతర విశ్వవిద్యాలయాలను కూడా లక్షంగా చేసుకొంటోందని కేసులో ప్రస్తావించింది. వాస్తవానికి ట్రంప్ సర్కార్ దేశంలోని పలు విశ్వవిద్యాలయాలపైనా ఏదో ఒక కారణంపై చర్యలు తీసుకుంటూనే ఉంది. పౌర హక్కులను ఉల్లంఘించారన్న కారణంపై ఇప్పటికే కొలంబియా, పెన్సిల్వేనియా సహా కార్నెల్, నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను నిలిపివేసింది.

నిబంధనలను అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మరో 60 విశ్వవిద్యాలయాలకు గత నెల విద్యా శాఖ లేఖలు రాసింది కూడా. తాజాగా జాతి వివక్ష ఘటనలు జరుగుతున్నాయన్న కారణంపై హార్వర్డ్‌కు ఇచ్చే గ్రాంట్లులో మరో 450 మిలియన్ డాలర్లు కోత విధిస్తున్నట్లు కూడా ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఇంతకీ హార్వర్డ్ వర్శిటీపై ట్రంప్‌కు ఎందుకింత ఆగ్రహం? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యం ఇందుకు కారణమని చెప్పాలి. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు తీవ్రం చేయడం గాజా ప్రాంతంలో వందలాది మంది పాలస్తీనియన్లు మృతి చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు చెలరేగాయి. హార్వర్డ విశ్వవిద్యాలయంలోని సంస్థ ప్రధాన పోషకుడు జాన్ హార్వర్డ్ విగ్రహంపై కొందరు పాలస్తీనా అనుకూల విద్యార్థులు పాలస్తీనా జెండా ఎగరేశారు. వాస్తవానికి ఆ విగ్రహంపై అమెరికా జెండా ఉంటుంది.

లేదంటే విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు వారి దేశ జెండాలను ఉంచుతారు. ఇదంతా జో బైడెన్ హయాంలో జరిగినప్పటికీ అ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ మాత్రం ఈ ఘటనలను మర్చిపోలేదు. స్వతంత్ర వ్యవస్థలుగా వ్యవహరిస్తున్న యూనివర్శిటీలను కట్టడిచేయాలని తీర్మానించుకొన్నారు. అమెరికాలోని విశ్వ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయాలంటూ ట్రంప్ సర్కార్ పట్టుబడుతోంది. అయితే ఇందులో యూనివర్శిటీలు మాత్రం ససేమిరా అంటున్నాయి. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కార్ ప్రకటించిన యుద్ధం ప్రపంచ ప్రఖ్యాత వర్శిటీల్లో ఒకటైన దానిలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది అధ్యాపకులపై ప్రభావం చూపించనుంది.

1636 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 6,800 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 14 వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులు అంటే దాదాపు 20 వేల మంది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విద్యా సంస్థకు ఘనమైన చరిత్ర ఉంది. వర్శిటీ పూర్వ విద్యార్థుల్లో 8 మంది అమెరికా అధ్యక్షులు, 30 మందికిపైగా విదేశీ దేశాధినేతలు, నోబెల్ లాంటి అంతర్జాతీయ అవార్డులు అందుకున్న పలువురు ఉన్నారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనేక మంది ఈ వర్శిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రసంగాలు చేశారు. ఈ విధంగా అన్ని దేశాలకు చెందినవారికి ఈ వర్శిటీతో అనుబంధం ఉంది. ఇన్ని వందల సంవత్సరాలు ఓ వెలుగు వెలిగిన విశ్వవిద్యాలయం ఇప్పటి ట్రంప్ సర్కార్ నిర్ణయంలో వివాదాల్లో చిక్కుకోవడం విచారకరం. ఇది విద్యా రంగానికి చెందిన నిపుణులందరికీ బాధాకరమే. విద్యా సంస్థలకు రాజకీయాల మురికి అంటడం ఎంతమాత్రం మంచిదికాదు. న్యాయస్థానాల జోక్యంతోనైనా ట్రంప్ కళ్లు తెరుస్తారేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News