వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఆంక్షలు విధించారని వైట్ హౌస్ తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాస్కోపై ఒత్తిడిని తెచ్చేందుకే భారత్ పై ఆంక్షలు విధించినట్లు చెప్పారు.”ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు తీవ్ర ప్రజా ఒత్తిడిని తెచ్చారు. ఇందుకోసం భారత్ పై ఆంక్షలు, ఇతర చర్యలను కూడా ట్రంప్ తీసుకున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలని తాను కోరుకుంటున్నానని ఆయన స్పష్టంగా చెప్పారు. అందుకే భారత్ పై చర్యలు తీసుకున్నామని.. ఇదొక పరిపాలనా వ్యూహం” అని లీవిట్ అన్నారు.
కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని.. వెంటనే దీనిని ఆపేయాలని ఇటీవల భారత్‌పై ట్రంప్ భారీగా అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు 25 శాతం చొప్పున మొత్తం 50 శాతం అదనపు సుంకాలను భారత్ పై విధించారు. తాము చెప్పినట్లు వినకపోతే.. ముందుముందు భారత వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు.. ప్రపంచ దేశాలల్లో భారత్ సుంకాలు అధికంగా ఉన్నాయని.. అందుకే వారితో తాము తక్కువగా వ్యాపారం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.