Wednesday, April 30, 2025

ప్రపంచశాంతికి ట్రంప్ తూట్లు?

- Advertisement -
- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం ఒక అనూహ్యమైన ఉద్రిక్తతలోకి నెట్టబడింది. ఆయన ఆడంబరమైన ప్రకటనలు, దూకుడైన విధాన ప్రతిపాదనలు, సాంప్రదాయేతర దౌత్యపరమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్పందనలను రేకెత్తించాయి. ఇరాన్‌పై, దాని అణుఆయుధ కార్యక్రమం కారణంగా బాంబుల వర్షం కురిపిస్తామని బెదిరించడం నుండి, రష్యాపై భారీ సుంకాలతో హెచ్చరించడం, గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేయాలని ప్రతిపాదించడం,గాజా వంటి సంఘర్షణ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని సూచించడం వరకు- ట్రంప్ రెండవ పదవీకాలం ప్రపంచ స్థిరత్వాన్ని సవాలు చేసే ఉద్విగ్న ప్రకటనలతో ప్రారంభమైంది.

ఈ పరిణామాలతో దేశాలు జీర్ణించుకుంటున్న సమయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ బెదిరింపులు శత్రుదేశాలకు మాత్రమే పరిమితం కాదు. దీర్ఘకాల స్నేహిత దేశాలు కూడా ఆయన ఆర్థిక ఆగ్రహానికి గురవుతున్నాయి. రష్యాను ఎదుర్కోవడంలో నాటో వ్యూహాత్మక ప్రాముఖ్యత, చైనాకు ప్రతిబంధకంగా భారత్ పాత్రను దృష్టిలో ఉంచుకుంటే ఈ చర్య విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఎక్స్‌లోని పోస్టులు ఈ విషయంపై అవిశ్వాసం, ఆందోళనలను ప్రతిబింబిస్తున్నాయి. వినియోగదారులు ‘రష్యాతో సరిహద్దు కారణంగా పోలాండ్‌ను లేదా చైనాతో సరిహద్దు కారణంగా భారత్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ అభిప్రాయాలు ఊహాజనితమైనప్పటికీ ట్రంప్ లావాదేవీ దృక్పథం పట్ల పెరుగుతున్న అసౌకర్యాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఊహకు అందకుండా ఉంది.

మంగోలియా గురించి ఇటువంటి చర్చలలో ప్రస్తావన, తక్కువ ప్రాముఖ్యత కలిగినప్పటికీ, ఒకే రకమైన భద్రతా తర్కాన్ని అన్నిటికీ వర్తింపజేయడం అసంగతతను హైలైట్ చేస్తుంది. రష్యా చైనాల మధ్య ఉన్న మంగోలియా తటస్థతను కాపాడుతూ వచ్చింది. అలాగే యుఎస్ జోక్యాన్ని సమర్థించే వ్యూహాత్మక ప్రాముఖ్యత కనపడటం లేదు. అయినప్పటికీ, ట్రంప్ ప్రకటనలు ఇటువంటి ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. గతం నుండి స్నేహంగా ఉన్న దేశాలతో కూడా విశ్వాసాన్ని క్షీణింపజేస్తూ, ఇతర దేశాలన్నీ ఆయన భౌగోళిక రాజకీయ ఆటలో పపెట్‌గా మారతామని భయపడుతున్నాయి. ఈ బెదిరింపుల తాకిడిలో, ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి తన శక్తిని కోల్పోయి, నిశ్శబ్దంగా ఉంది. దానికి ఉన్న ఆర్థిక వనరులను ట్రంప్ కట్ చేశారు.

డిసెంబర్ 5, 2024న అట్లాంటిక్ కౌన్సిల్ హెచ్చరించిన ప్రకారం, ట్రంప్ చర్యలు అమెరికా ప్రపంచ నాయకత్వం నుండి వైదొలగడాన్ని సూచించవచ్చు. ఈ ఆందోళన 2025 లో ఆయన విధానాలు వెల్లడవుతున్న కొద్దీ మరింత తీవ్రమైంది. రష్యా, చైనా వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలు, ట్రంప్ చర్యలు పాశ్చాత్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఆయనను ఖండించడానికి అవి తమ శక్తిని చూపించలేని దీనస్థితికి అవి చేరుకున్నాయి. ఉక్రెయిన్‌కు యుఎస్ సహాయాన్ని నిలిపివేయడాన్ని ‘శాంతి వైపు ఒక అడుగు’గా మార్చి 4న ‘ది గార్డియన్’ లో ప్రశంసించింది. ట్రంప్ నాయకత్వంలో యుఎస్, మరొక వీటో శక్తికలిగిన సభ్యుదేశం, స్వీయ-నియంత్రణ చేసుకునే అవకాశం లేదు. ఫ్రాన్స్, యుకెలను నాటోలో అమెరికా సైనిక సహాయంపై ఆధారపడే ఏకైక శాశ్వత సభ్య దేశాలుగా వదిలివేసింది.

ఈ స్తబ్దత విమర్శలను రేకెత్తించింది. మార్చి 2న ‘ది కన్వర్సేషన్’ పేర్కొన్న ప్రకారం, ట్రంప్ ప్రవర్తన ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ విశ్వసనీయతను అమెరికా క్షీణింపజేస్తోంది. చైనా, భారత్, రష్యా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఇరాన్, లెబనాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికాను ఒంటరిగా చేసి హాని చేయగలవా అనే ప్రశ్న ఆకర్షణీయమైనది? సంక్లిష్టమైనది కూడా! ఈ దేశాలు సమష్టిగా గణనీయమైన ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన శక్తిని కలిగి ఉన్నాయి. డిసెంబర్ 5, 2024 ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే పేర్కొన్నట్టు చైనా రష్యా మధ్య పెరుగుతున్న స్నేహ, సమన్వయం, ఇరాన్, ఉత్తర కొరియాతో బలపడి ఒక శక్తివంతమైన బ్లాక్‌ను ఏర్పర్చే అవకాశం ఉంది.

చైనాతో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ సంప్రదాయేతర సంఘీభావ చరిత్రను కలిగి ఉంది. సుంకాల ఒత్తిడితో యుఎస్ నుండి దూరమవవచ్చు. ట్రంప్ బెదిరింపులతో కలవరపడిన నాటో దేశాలు, మార్చి 4న ది గార్డియన్ ప్రకారం, ఇయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఎ 800 బిలియన్ రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించడంతో స్వాతంత్య్రం వైపు అడుగులు వేస్తున్నాయి. అయినప్పటికీ, ఐక్యత సాధ్యం కావడం కష్టంగా ఉంది. మార్చి 3న ‘టైమ్’ సూచించిన ప్రకారం, యుఎస్‌తో సన్నిహిత పొరుగు, ఆర్థిక భాగస్వామిగా ఉన్న కెనడా వ్యాపార స్థిరత్వాన్ని ప్రాధాన్యతగా చేసుకుని వ్యతిరేకతకు నాయకత్వం వహించే అవకాశం లేదు. లెబనాన్, అంతర్గత సంఘర్షణలలో చిక్కుకుని, అమెరికాను సమర్థవంతంగా సవాలు చేసే సామర్థ్యం లేకుండా ఉంది. ఉత్తర కొరియా ఒంటరితనం దాని ప్రభావాన్ని రెచ్చగొట్టడం వరకే పరిమితం చేస్తుంది.

ఎక్స్‌లో ట్రెండింగ్ పోస్టులు ఈ విచ్ఛిన్నతను గురించి విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వినియోగదారు ‘అమెరికాను ఓడించడానికి వారు ఏమీ చేయలేరా?’ అని ప్రశ్నించారు. వాస్తవం ఏమిటంటే యుఎస్ డాలర్, మార్కెట్‌లపై ఆర్థికంగా ఆధారపడటం అమెరికాను ఒంటరిగా చేయడం కోసం ఏకీకృత ప్రయత్నాన్ని సంక్లిష్టం చేస్తుంది. ఫిబ్రవరి 21న ఫోర్బ్ విశ్లేషణ ప్రకారం, ట్రంప్ సుంకాలు అంతరాయం కలిగించినప్పటికీ ఈ ఆధారపడటాన్ని ఆయన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నాయి. ట్రంప్ వ్యూహం, భయం, ఆర్థిక ఒత్తిడి ద్వారా ప్రపంచాన్ని తన ఇష్టానికి లొంగమని ఒత్తిడి చేయగలదనే నమ్మకంతో అమెరికా ఉంది. ఇరాన్‌పై బాంబు దాడులు, రష్యాపై సుంకాలు, స్నేహిత దేశాలను బెదిరించడం వంటివి అమెరికా లాభం ఇతరులకు నష్టంగా ఉండాలనే శూన్య -సమీకరణ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

అయితే ఈ విధానం విఫలమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫిబ్రవరి 28న రెస్పాన్సిబుల్ స్టేట్ క్రాఫ్ట్ ఉక్రెయిన్, యూరప్‌ను దూరం చేయడం రష్యాకు వ్యతిరేకంగా యుఎస్ స్థానాన్ని బలహీనపరుస్తుందని హెచ్చరించింది.అదే సమయంలో మార్చి 1న న్యూస్‌వీక్ మాజీ యుఎస్ రాయబారి జాన్ బోల్టన్ ట్రంప్ పుతిన్‌తో సమన్వయాన్ని ‘సిగ్గుచేటు’ గా విమర్శించారు. మార్చి 3న వాషింగ్టన్ పోస్ట్ సుంకాల ఆర్థిక పరిణామాలను హైలైట్ చేసింది. యుఎస్ ఆర్థిక మాంద్యం గురించి భయాలను సూచిస్తూ మార్చి 9 ‘టైమ్’ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ బలహీనతను తోసిపుచ్చినప్పటికీ, అది ఆయన ప్రభావాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాక, జెలెన్‌స్కీని ‘సర్వాధికారి’ అని పిలవడం (ఫోర్బ్ ఫిబ్రవరి 21) లేదా యూరోపియన్ నాయకులను అవమానించడం వంటి ట్రంప్ విధానాలు అమెరికా ఎప్పటినుంచో ఆధారపడిన సాఫ్ట్ పవర్‌ను క్షీణింపజేస్తాయి.

మార్చి 2న ది కన్వర్సేషన్ హెచ్చరించిన ప్రకారం, ఇది జపాన్, దక్షిణ కొరియా వంటి స్నేహిత దేశాలకు యుఎస్ హామీలు నమ్మదగినవి కావని సంకేతాన్ని ఇస్తున్నది. ఆసియాలో అణు వ్యాప్తిని ప్రేరేపించే అవకాశం ఉంది. అమెరికాను నమ్మకమైన భాగస్వామిగా కాకుండా లావాదేవీ దౌర్జన్యకర్తగా దేశాలు గ్రహిస్తే అవి రష్యా-, చైనా ఆకాంక్షను బలోపేతం చేస్తూ ప్రత్యామ్నాయ సమన్వయాలను వెతకవచ్చు. నిశ్శబ్దంగా ఉండడం ఒక ఎంపిక కాదు. అమెరికాతో సైనిక ఘర్షణ అసంభవమైనది, అవాంఛనీయమైనప్పటికీ, దేశాలు ట్రంప్ బెదిరింపులను సమన్వయ దౌత్యం, ఆర్థిక ప్రతిచర్యల ద్వారా ఎదుర్కోవాలి. ఫిబ్రవరి 28న న్యూస్‌వీక్ నివేదించిన ప్రకారం, ఓవల్ ఆఫీస్ వివాదం తర్వాత యూరోపియన్ నాయకులు జెలెన్‌స్కీకి వెంటనే మద్దతు ప్రకటించడం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. పోలాండ్ డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఫ్రెడరిక్ మెర్జ్ ఉక్రెయిన్‌తో ఐక్యతను ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ ఒత్తిడిని ధిక్కరించే సంకల్పాన్ని సూచించారు.

సుంకాల బెదిరింపులను ఎదుర్కొంటున్న భారత్, మార్చి 7న బిబిసి న్యూస్ ఊహించిన ప్రకారం, యుకె, యుఎస్ సుంకాల చర్చల మధ్య తన సొంత లెవీలతో ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి అడ్డంకుల్లో ఉన్నప్పటికీ యుఎస్ వీటో అధికారం వర్తించని జనరల్ అసెంబ్లీ ద్వారా చిన్న దేశాల స్వరాన్ని వినిపించగలదు. కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, ఇయు వంటి మధ్యస్థ శక్తుల సమాహారం ఉద్రిక్తతను నివారిస్తూ, సార్వభౌమత్వాన్ని నొక్కిచెప్పే సమతుల్య ప్రతిస్పందనను రూపొందించవచ్చు. దీనికి విరుద్ధంగా, నిశ్శబ్దం ట్రంప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహిస్తుంది. ఒక విరామ బిందువు వచ్చేవరకు పరిమితులను పరీక్షిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ రెండవ పదవీ కాలం అంతర్జాతీయ సంబంధాల పునాదులను సవాలు చేసే బెదిరింపుల తుఫానును విడుదల చేసింది.

తెహ్రాన్ నుండి మాస్కో వరకు, గ్రీన్‌లాండ్ నుండి గాజా వరకు ఆయన మాటలు, చర్యలు యుఎస్ విధానంలో సమూలమైన మార్పును సూచిస్తున్నాయి. -ఇది సమష్టి స్థిరత్వంపై ఏకపక్ష లాభాన్ని ప్రాధాన్యతగా చేస్తుంది. అమెరికా శత్రువులు పెరుగుతూ, స్నేహిత దేశాలు సందిగ్ధంలో ఉండగా, ప్రపంచం విభజనలోనూ అనుసంధానంలోనూ ఉంది. ఈ రెచ్చగొట్టే వ్యక్తిని ఎదుర్కోవడానికి దేశాలు ఐక్యమవుతాయా లేక ఉద్రిక్తత తగ్గుతుందనే ఆశతో ఆయన ఆడంబరాన్ని సహిస్తాయా అనేది అనిశ్చితంగా ఉంది.అయితే ఒక విషయం స్పష్టంగా ఉంది. ప్రమాదాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే క్షీణిస్తున్న ప్రపంచ క్రమం ట్రంప్ ఈ ఆటను మరో నాలుగు సంవత్సరాలు నష్టం లేకుండా తట్టుకోలేదు. ఇప్పుడు సమంజసమైన, దృఢమైన ప్రతిస్పందన అవసరం -ప్రకటనలు వినాశనంగా మారక ముందే చర్యలు చేపట్టడం అవసరం.

డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News