న్యూయార్క్: భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో మరో పోస్ట్ చేశారు. చారిత్రక నిర్ణయానికి అమెరికా సాయపడటం గర్వంగా ఉందని ప్రశంసించారు. భారత్, పాకిస్థాన్ కాల్పులు విరమించకపోతే లక్షలాది మంది మరణించేవారని, రెండు దేశాలతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని స్పష్టం చేశారు. భారత్, పాక్ బలమైన నాయకత్వాల పట్ల గర్వపడుతున్నానని, వెయ్యేళ్ల తర్వాతైనా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో పరిశీలించేందుకు కృషి చేస్తానని ట్రంప్ వివరించారు. కశ్మీర్ విషయంలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకునే జ్ఞానం ఇరు దేశాలకు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైందని ఇరు దేశాలు గుర్తించాయన్నారు.
జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. పాక్ కాల్పులు, దాడులతో కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ము, శ్రీనగర్, అఖ్నూ్‌ర్, రాజౌరి, పూంచ్‌లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది.