Friday, August 15, 2025

భారత్‌-పాక్ అణుయుద్ధం వరకు వెళ్లాయి.. ట్రంప్ మళ్లీ అదే మాట

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్, కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పలు సంక్షోభాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించానని మరోసారి ప్రకటించుకున్నారు. భారత్‌-పాకిస్థాన్ మధ్య ఘర్షణకు సంబంధించి మరోసారి అదే మాట మాట్లాడిన ఆయన, ఆ రెండు దేశాలు అణుయుద్దం వరకు వెళ్లాయన్నారు. ఆ సమయంలో 67 విమానాలు నేల కూలాయాన్న ట్రంప్, రెండు దేశాల ఘర్షణను తామే పరిష్కరించినట్టు చెప్పారు. ఇలా గత ఆరు నెలల్లో ఆరు యుద్ధాలను ఆపానంటూ వైట్‌హౌస్‌లో వెల్లడించారు.

“గత ఆరు నెలల వ్యవధిలో ఆరు యుద్ధాలను ఆపాను. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. భారత్‌-పాక్‌ల విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. 6 నుంచి 7 విమానాలు నేల కూలాయి. అలా ఆ రెండు దేశాలు అణుయుద్ధానికి సిద్ధమవగా, వాటిని మేమే పరిష్కరించాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తమ నిర్ణయంలో ఎటువంటి విదేశీ జోక్యం లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై లోక్‌సభలో ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై దాడులను ఆపాలని తమకు ఏ దేశం చెప్పలేదని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్షాలను పూర్తి చేసుకున్న తరువాతే ఆపరేషన్‌కు విరామం ఇచ్చామన్నారు.

శాంతి ఒప్పందానికి రష్యా, ఉక్రెయిన్ సిద్ధం
అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్న ట్రంప్ శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నట్టు తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌కు అరుదైన ఖనిజాలు అందించడానికి యూఎస్ సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్నకు ఈ భేటీ రష్యాతోపాటు అమెరికాకు కూడా చాలా ముఖ్యమన్నారు. వేలాది మంది సైనికులను రక్షించడానికే తాను ఇదంతా చేస్తున్నట్టు వివరించారు. పుతిన్‌తో జరగనున్న ఈ సమావేశం 25 శాతం విఫలం అయ్యే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో జెలెన్‌స్కీ, పుతిన్‌లతో కలిసి మరో సమావేశం ఉంటుందని సూచన ప్రాయంగా చెప్పారు. అందులో యూరోపియన్ నాయకులు ఉండొచ్చన్నారు. అక్కడ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పుతిన్, జెలెన్‌స్కీలు కలిసిపోతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తాను అధికారంలో ఉండి ఉంటే రష్యాఉక్రెయిన్ మధ్య అసలు యుద్ధం జరిగి ఉండేది కాదని ఉద్ఘాటించారు.

ట్రంప్ ప్రయత్నాలు ప్రశంసనీయం : పుతిన్
యుద్ధాన్ని ముగించి , శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ నిజాయితీగా చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని భేటీని ఉద్దేశిస్తూ పుతిన్ ఓ వీడియో విడుదల చేశారు. అణ్వాయుధాలపై నియంత్రణ ద్వారా రష్యా, అమెరికా , ఐరోపా దేశాలతో సహా ప్రపంచమంతా శాంతిని నెలకొల్పవచ్చని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News