న్యూయార్క్ ః ఎలన్ మస్క్ కొత్త పార్టీ ఆలోచన అసంబద్ధం, అనుచితం అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ అత్యంత సంపన్న మిలియనీర్ ఇప్పుడు పూర్తిగా పట్లా తప్పాడని వాఖ్యానించారు. ఒకప్పటి తన అత్యంత సన్నిహితుడు అయిన మస్క్ తాను అమెరికన్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడున్న అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీలకు పోటీగా తమ పార్టీ ఉంటుందని మస్క్ ప్రకటించారు. ఇప్పుడు మస్క్ మూడో పార్టీని ప్రకటించడం ఆలోచనా రహితం అని ట్రంప్ తమ ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో బయలుదేరి వెళ్లేముందు మీడియాతో చెప్పారు.
మూడో పార్టీతో మరింత గందరగోళం చేయడం మస్క్ తీరుగా ఉంది. మొత్తం మీద ఆయన ఆలోచనల అయోమయం దీనికి అద్దం పడుతోంది అని ట్రంప్ మండిపడ్డారు. తమ ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా స్పందించారు. అమెరికాలో ఎప్పుడూ కూడా మూడో రాజకీయ పక్షం వచ్చిందీ లేదు. ముందుకు సాగిందీ లేదని , ఇక మస్క్ వ్యవహారం కూడా ఇదే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి పార్టీ ఆలోచన అమెరికాలో గందరగోళానికి, అల్లర్లకు ఆజ్యం పోయడంలో పనికివస్తుందని చెప్పారు. టెస్లా అధినేత తన సంస్థకు సబ్సిడీల్లో కోత పడ్డప్పటి నుంచి ఏదో విధంగా ఆలోచిస్తున్నారని , ఇప్పటి పార్టీ ప్రకటన ఇందుకు అద్దం పడుతుందని విమర్శించారు.