టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
మొత్తం 92.78శాతం ఉత్తీర్ణత 4,629
స్కూళ్లలో వందశాతం పాస్ సబ్జెక్టుల
వారీగా మార్కులతోపాటు గ్రేడింగ్
పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన
సిఎం రేవంత్‌రెడ్డి జూన్ 3 నుంచి
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఫీజు చెల్లింపు తుది గడువు మే 16
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలలో బాలికలు పై చేయి సాధించారు. ఈ ఫలితాలలో మొ త్తం ఉత్తీర్ణత 92.78 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 94.26 శాతం నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 91.32 శాతంగా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత, బాలుర కంటే 2.94 శాతం అధికంగా నమోదైం ది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇ.వి.నరసింహారెడ్డి, ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ఎ.కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇ.వి.నరసింహారెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది పదో తరగతిలో మొత్తం ఉత్తీర్ణత 91.31 శాతం నమోదు కాగా, ఈసారి 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ మోడల్ స్కూల్స్,ప్రైవేట్, కెజిబివి మెరుగైన ఉత్తీర్ణత నమోదయ్యిందని తెలిపారు. ఈ ఫలితాలలో పలువురు అత్యధికంగా 596 మార్కులు సాధించారు.
రెండు పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ పాస్‌కాలేదు
రాష్ట్రంలో 4,629 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రెండు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కా లేదు. గురుకుల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గురుకులాల్లో 98.79శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్, ప్రభుత్వం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో రాష్ట్ర సరాసరి కన్న తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. పదవ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,07,107 మంది విద్యార్థులు హాజరు కాగా 4, 96,374 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 4,96,374 మంది హాజరుకాగా, 4,60,519 మంది ఉ త్తీర్ణత సాధించారు. అలాగే 10,733 మంది ప్రైవేట్ విద్యార్థు లు హాజరు కాగా, 6,141 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,50, 345 మంది బాలికలు పది పరీక్షలకు హాజరుకాగా, 2,46, 029 మంది ఉత్తీర్ణత సాధించగా, 2,28,608 మంది బాలురకు 2,31,911 మంది ఉత్తీర్ణులయ్యారు.
మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు
రాష్ట్రంలో ఇప్పటివరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సిజిపిఎ ఇచ్చే వారు. ఈసారి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చారు. మెమోలో సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్‌తో పాటు సబ్జెక్టుల వారీగా పాసయ్యారా..? ఫెయిలయ్యారా..? పేర్కొన్నారు. సిబిఎస్‌ఇలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి, మొత్తం ఎన్ని మార్కులో ఇవ్వడం లేదు. ఈసారి రాష్ట్రంలో కూడా అదేవిధానాన్ని అమలు చేశారు. మెమోల్లో బోధనేతర అంశాల్లో గ్రేడ్లు ఇచ్చారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరికులర్ అంశాలకు సంబంధించిన గ్రేడ్లను మెమోలో ఇచ్చారు. అలాగే వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.
మహబూబాబాద్ ఫస్ట్ .. వికారాబాద్ లాస్ట్
టెన్త్ ఫలితాల్లో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 99.29 శాతం ఉత్తీర్ణులు కాగా అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో 73.97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 99.09 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో, 98.81 శాతం ఉత్తీర్ణతతో జనగాం జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,07,107 మంది విద్యార్థులు హాజరు కాగా 4,96,374 మంది ఉత్తీర్ణులయ్యారు.
జూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 16గా నిర్ణయించారు. ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం ఉంటుంది. రీ- కౌంటింగ్‌కు రూ. 500, రీ-వెరిఫికేషన్‌కు రూ. వెయ్యి ఫీజు చెల్లించాలని అన్నారు. పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి.
పరీక్షలకు హాజరైన విద్యార్థులు : 4,94,374
ఉత్తీర్ణత సాధించవారు : 4,60,519
ఉత్తీర్ణత శాతం : 92.78
పరీక్షలకు హాజరైన బాలికలు : 2,46,029
ఉత్తీర్ణత సాధించిన బాలికలు : 2,31,911
బాలికల ఉత్తీర్ణత శాతం : 94.26
పరీక్షలకు హాజరైన బాలురు : 2,50,345
ఉత్తీర్ణత సాధించిన బాలురు : 2,26,608
బాలుర ఉత్తీర్ణత శాతం : 91.32
మీడియం హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
తెలుగు 53,559 44,698 83.46
ఇంగ్లీష్ 4,35,138 4,09,068 94.01
ఉర్దూ 7,253 6,362 87.72
ఇతర మీడియం 424 391 92.21