ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా
జూన్ 18 నుంచి 30 వరకు జరిగిన పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ జూన్ 2025) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పరీక్షలో 33.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సచివాలయంలో టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ రమేష్, అధికారులు పాల్గొన్నారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి. పేపర్ 1కు 47,224 మంది అభ్యర్థులుహాజరుకాగా, 29,043 మంది(61.50 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 48,998 మంది హజరుకాగా, 17,574 మంది(35.87 శాతం) ఉత్తీర్ణులు కాగా, పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 41,207 మందికిగానూ 13,075 మంది(31.73 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
టెట్ పరీక్షలకు మొత్తం 90,205 మంది హాజరు కాగా, 30,649 మంది(33.98 శాతం) ఉత్తీర్ణులయ్యారు. తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ,తమిళం, సంస్కృతం సబ్జెక్టులకు ఆరు సెషన్‌లలో పేపర్ 1 పరీక్ష, 10 సెషన్లలో ఏడు భాషలలో పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. కాగా, రాష్ట్రంలో టిజి టెట్‌లో ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. జనవరిలో టిజి టెట్ 2025 పరీక్షలో 31.21 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి 33.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
డిఎస్‌సికి టెట్ అర్హత తప్పనిసరి
ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్‌సి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదవ తరగదతి వరకు బోధించే ఎస్‌జిటి పోస్టులకు, పేపర్ -2కు అర్హత సాధించిన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయు పోస్టుల నియామకాలకు నిర్వహించే డిఎస్‌సి హాజరయ్యేందుకు తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.