బుధవారం తెల్లవారుజామున తీవ్రాతి తీవ్ర భారీ భూకంపం రష్యాను కుదిపేసింది. రష్యా దూర ప్రాచ్య ప్రాంతంలో ఇంతకు ముందెన్నడూ చవిచూడని రీతిలో ఈ భూకంప తీవ్రత ఉంది. ఇది తన ప్రభావాన్ని బహుదూరం వరకూ విస్తారితం చేసింది. రెక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్, అమెరికాలోని ద్వీపరాష్ట్రం హవాయ్, అమెరికా పశ్చిమ తీరంలో సునామీ భీకర అలలు తలెత్తాయి. ఇప్పటివరకూ ఈ భూకంపం , తరువాత సునామీతో భారీ స్థాయి నష్టం ఏదీ జరగలేదు. అయితే పల్లపు ప్రాంతాల వారు, తీర ప్రాంతాల ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వెలువరించారు. రష్యాలోని కామ్చాట్క ద్వీపకల్పం కేంద్రీకృతంగా ఈ భూ కంపం నమోదైంది. దీనితో ఈ ప్రాంతంలోని పలు రేవులలో ప్రమాద ఘంటికలు వెలువరించారు. హవాయ్ ప్రాంతంలో జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
సునామీ తాకిడితో జపాన్‌లోని ఉత్తర దీవి హోక్కైడో వద్ద దాదాపుగా రెండు మీటర్ల అలలు తలెత్తాయి. ఇక భూకంప ప్రధాన కేంద్రం నెలకొన్న రష్యాలోని ద్వీపకల్పం ప్రాంతంలో భీకరంగా 3 నుంచి 4 మీటర్ల సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రాంతంలో జనం భయభ్రాంతులు అయ్యారు. ఇక జపాన్‌లో పలు నగరాలలోకి కూడా సముద్ర జలాలు వచ్చిపడ్డాయి. దీనితో వాహనాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం నడుమ చిక్కుపడ్డాయి. హవాయ్ రాజధానిలో హై వేలపై రాకపోకలు నిలిచిపోయ్యాయి. ఇప్పటి సునామీ ప్రభావంతో జసాన్‌లోని ఏ అణు కేంద్రానికి కూడా ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. అయితే భూకంపాలు, తరువాతి సునామీల దశలోనే అణు కేంద్రాలలో అసాధారణ పరిస్థితులతో అణుధార్మిక తరంగాలు వ్యాపించిన ఘటనలు 2011లో చోటుచేసుకోవడంతో ఇప్పుడు అధికారులు ఈ ఆకస్మిక పరిణామంపై యుద్ధ ప్రాతిపదికన జాగ్రత్తలు తీసుకున్నారు. జపాన్ , హవాయ్‌లలో కొద్ది గంటల పాటు సునామీ ప్రభావం కనబడింది, తరువాత పరిస్థితిని గుర్తించి అధికారులు ప్రమాద హెచ్చరికల తీవ్రతను తగ్గించి ప్రకటనలు వెలువరించారు.
పరిస్థితిని జపాన్ భూకంప పరిశోధనా సంస్థ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. పసిఫిక్ సముద్ర దక్షిణ తీర ప్రాంతలో కూడా కాలిఫోర్నియా వరకూ కూడా ఇప్పటికీ సునామీ ముప్పు గురించి ఆందోళన చెందుతున్నారు. హవాయ్‌లో బీచ్‌లు ఎక్కువగా మునిగిపోతాయని, యాత్రికలు జాగ్రత్తగా ఉండాలని లేదా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హవాయ్ రక్షణ విభాగం ఉన్నతాధికారి మేజర్ జనరల్ స్టీఫెన్ లోగన్ ఓ ప్రకటన వెలువరించారు. భారీ స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని హవాయ్, ఒరెగాన్ స్థానికులకు హెచ్చరికలు పంపించారు. భూంకపం కేంద్రం రష్యా తీరంలో ఉన్నప్పటికీ దీని ప్రభావం ఎక్కువగా జపాన్ ఇతర ప్రాంతాల్లో పడింది. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 8.25 గంటలకు భూకంపం వచ్చింది. ముందుగా జపాన్, అమెరికా నిపుణులు భూకంప తీవ్రతను 8.0గా అంచనావేశారు. అయితే ఆ తరువాతి క్రమంలో ఇది 8.8 తీవ్రత అని యుఎస్ జియాలాజికల్ సర్వే తాజా సమాచారం వెలువరించింది. భూమిలో 250.7 కిలోమీటర్ల అడుగున కేంద్రీకృతం అయిందని నిర్థారించారు. రష్యాలో దాదాపు రెండు లక్షల మంది వరకూ జనాభా ఉన్న పెట్రోపలవ్లోవస్క్ కామ్చాట్కాకు 119 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉంది.
పలు దేశాలకు వీడని సునామీ భయాలు..భారత్‌కు ముప్పులేదని నిపుణుల నిర్థారణ
తీర ప్రాంతంలో భారీ భూంకపం తలెత్తడం ఇది భూగర్భంలో కేంద్రీకృతం కావడంతో ఇప్పటికీ ఇతర దేశాలకు కూడా సునామీ ఇతరత్రా ముప్పు భయాలు వీడలేదు. సముద్రంలో తలెత్తే పలు పరిణామాలతో ఎప్పుడైనా ఎక్కడైనా సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో విస్తారిత సముద్ర తీరాలు ఉండే భారత్, అమెరికా, బ్రిటన్ ఇతర దేశాల సంబంధిత విషయాల నిపుణులు ఎప్పటికప్పుడు శాస్త్రీయ విశ్లేషణలతో పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. భారతదేశానికి ఎటువంటి తీర ప్రాంత ముప్పు లేదని దేశ రాజధాని ఢిల్లీలో అధికార వర్గాలు తెలిపాయి. అయితే విశాఖపట్టణం, ముంబై , కోల్‌కతాల్లోని నౌకాధికారులు , నిపుణుల బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇప్పటి భూంకంపంతో సునామీ ముప్పు ఎక్కువగా న్యూజిలాండ్ , ఉత్తర దక్షణ కొరియాలు,, వియత్నాం, బ్రూనై వంటి తీర సంక్లిష్ట ప్రాంత దేశాలకు ఉంటుందని విశ్లేషించారు.
ఉలికిపడి, తరలిన మొత్తం రాష్ట్రం
మైళ్ల దూరం వరకూ కార్లు ట్రక్కులు
రష్యా కేంద్రీకృత భూకంపం ప్రభావం ఎక్కువగా అమెరికా ద్వీప రాష్ట్రం హవాయ్‌ను దెబ్బతీసింది. ఇక్కడికి ఎక్కువగా యాత్రికుల తాకిడి ఉంటుంది.సునామీ హెచ్చరికలు, తరువాతి భారీ స్థాయి అలలు విరుచుకుపడుతూ ఉండటంతో దాదాపుగా రాష్ట్రం అంతా సురక్షిత ప్రాంతాలకు తరలిన దృశ్యాలు వెల్లువెత్తాయి. ప్రజలు ప్రత్యేకించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అందుబాటులోకి వచ్చిన వాహనాలలో సురక్షిత ఎతైన ప్రాంతాలకు తరలివెళ్లారు. హవాయ్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తూ , సహాయక చర్యలను సమన్వయపర్చారు. అలస్కా ఇతర ప్రాంతాలలో కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడం, ఎటు నుంచి సునామీ అలలు భయాలు వేటాడటంతో జనం భయాందోళనలకు గురయ్యారు.