తిరుపతి: కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనే శ్రీవాణి టికెట్లపై టిటిడి (TTD) మార్పులు చేసింది. ఇప్పటి వరకూ శ్రీవాణి టికెట్లపై స్వామిని దర్శించుకోవాలంటే మూడు రోజుల సమయం పట్టేది. కానీ ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనానికి వీలు కల్పించింది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకూ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఉదయం ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద రిపోర్టు చేయాలి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టిటిడి ప్రయత్నిస్తోంది.
ఇక శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి మార్పులు లేవని టిటిడి (TTD) స్పష్టం చేసింది. యథావిధిగా తిరుమలలో ఉదయం 10 గంటలకు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తామని టిటిడి అధికారులు తెలిపారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31 వరకూ శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.