తిరుమల శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితం. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి.
శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని టిటిడి అధికారులు హెచ్చరించారు. తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టిటిడి ఒక ప్రకటనలో పేర్కొంది.