తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ(తమిళగ వెట్రి కళగం) ముఖ్యమంత్రి అభ్యర్థిగా టివికె వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం చైన్నైలో జరిగిన పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ… తమిళనాడు ఎన్నికల్లో అధికారంలో ఉన్న డిఎంకెతో లేక బిజెపితో ప్రత్యక్షంగా లేక అప్రత్యక్షంగా ఎలాంటి పొత్తుపెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు తమకు సైద్ధాంతిక వైరి పార్టీలని పేర్కొన్నారు. పార్టీకి మద్దతు కూడగట్టుకునేందుకు విజయ్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఓటర్లను కలుసుకోనున్నారు.
పార్టీ కీలక సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. వాటిలో శ్రీలంక నుంచి కచతీవు ద్వీపాన్ని కేంద్ర స్వాధీనం చేసుకోవాలన్నది ఒకటి. న్యూఢిల్లీలో రైతులు నిరసన ప్రదర్శన చేసినప్పుడు కేంద్రం వారి పట్ల ప్రవర్తించిన తీరును మరో తీర్మానం ఖండించింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని, ఆయన వ్యాఖ్యలు తమిళనాడు అనుసరిస్తున్న ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడి అని ఇంకో తీర్మానంలో పేర్కొన్నారు. తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషల్ని రుద్దడాన్ని తమ పార్టీ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలని మతం పేరిట విభజిస్తోందని విజయ్ అన్నారు.