వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.126కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…నల్గొండ జిల్లా పిఎ పల్లి మండలం, చింతతండా ప్రాంతానికి చెందిన సాబావత్ హనుమ అనే వ్యక్తి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి సరూర్‌నగర్‌లో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని హల్మాస్‌గూడ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ ఎస్సై శోభారాణి,
సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం సరూర్‌నగర్ స్టేషన్‌లో అప్పగించామని ఎస్‌టిఎఫ్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ధూల్‌పేట్‌లో గంజాయి విక్రయిస్తున్న మాయబాయి అనే మహిళను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 1.126కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బల్‌దేవ్‌సింగ్ అనే వ్యక్తికి కూడా గంజాయి విక్రయంతో సంబంధం ఉండడంతో అతడిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితురాలిని ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.