Friday, May 23, 2025

సల్మాన్ నివాసంలోకి చొరబాట్లు..ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద వరుసగా రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు భద్రతా సిబ్బందికి కలవరం కల్గించాయి. మంగళవారం తరువాత బుధవారం అనుమానాస్పద స్థితిలో ఆగంతకులు బంగళాలోనికి వెళ్లేందుకు యత్నించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డులను బెదిరించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. చిరకాలంగా కృష్ణ జింకల వేట ఉదంతంలో సల్మాన్‌కు చావు బెదిరింపులు అనేకం వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నివాసంలోకి కొందరు చొరబడటం మరింత ఆందోళనకు దారితీసింది. ఇక్కడి బాంద్రా ప్రాంతంలో సల్మాన్ బిల్డింగ్ ఉంది. అరెస్టు అయిన వారిలో ఒక యువకుడు ఓ యువతి ఉన్నారని బంద్రా పోలీసులు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి , విచారిస్తున్నట్లు చెప్పారు. బాంద్రా వెస్ట్‌లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇప్పుడు భద్రతను మరింతగా పెంచారు.

అరెస్టు అయిన 23 సంవత్సరాల జితేంద్ర కుమార్ సింగ్ మంగళవారం ఈ నివాసంలోకి ప్రవేశించారు. అంతకు ముందు చాలా సేపటి వరకూ ఆయన నివాసం వద్ద తచ్చాడారు. తరువాత భద్రతా సిబ్బంది కన్నుగప్పి లోపలికి చేరాడని వెల్లడైంది. ఈ సమయంలో హీరో లోపల ఉన్నారా? లేదా అనేది తెలియలేదు. ఇంటిలోపలికి చేరుకున్న ఈ వ్యక్తిని పోలీసులు బయటకు వెళ్లాలని గదమాయించడంతో తన చేతిలోని సెల్‌ఫోన్ తీసి నేలకు విసిరికొట్టాడు. ఈ వ్యక్తి చత్తీస్‌గఢ్‌కు చెందిన వాడుగా తెలిసింది. కాగా బుధవారం ఉదయం ఓ మహిళ నివాసంలోకి చేరుకుంది. ముందుగా అపార్ట్‌మెంట్‌లోపలికి చేరుకుని , తరువాత సల్మాన్ ఫ్లాట్‌లోనికి వెళ్లింది. ఇంటరాగేషన్ దశలో ఇద్దరు కూడా తాము సల్మాన్ ఫ్యాన్స్‌మని, ఆయనను కలిసేందుకు వచ్చామని తెలిపారు. అయితే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోవడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News