మహారాష్ట్ర వరదల్లో చిక్కుకుని ఆదివారం రాత్రి కారుతో సహా గల్లంతైన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు మహిళల్లో ఇద్దరి మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. మరో మహిళ అఫ్రిన్ మృతదేహం కోసం అక్కడి అధికార యంత్రాంగం గాలింపు జరుపుతోంది. ఘటన జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో కారు లభించగా, మూడు కిలోమీటర్ల దూరంలో హసీనా మృతదేహం, 5 కిలోమీటర్ల దూరంలో సమీనా మృతదేహం లభించినట్లు అక్కడ గాలింపులో పాల్గొన్న టిఆర్‌నగర్ మాజీ కౌన్సిలర్ చాంద్‌పాషా తెలిపారు. హసీనా, సమీనా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముక్తాడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గల్లంతైన మహిళల కుటుంబ సభ్యులంతా
సోమవారం ఉదయమే సంఘటనా స్థలానికి చేరుకుని తమ వారి కోసం గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. లభ్యమైన ఇద్దరి మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టుకున్నారు. హసీనాకు భర్త కూతురు, కుమారుడు ఉండగా, సమీనాకు భర్త కుమారుడు ఉన్నారు. అచూకీ లభించని అఫ్రీన్‌కు భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహా వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన జగిత్యాలలోని టిఆర్‌నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం రాత్రి అక్కడ వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారు.