నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, చేపూర్ గ్రామ జాతీయ 63వ రహదారి మూలమలుపు వద్ద డిసిఎం వ్యాన్, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. ఈ ప్రమాదంలో ఆర్మూర్ పట్టణ దోబీగల్లీకి చెందిన కొండూరు అర్జున్ (21) ఘటన స్థలంలో మృతి చెందాడు. కొండూరు నరేంద్ర (19) తీవ్ర గాయాలతో కొనఊపిరితో ఉండగా అంబులెన్స్ ద్వారా హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం, పెద్దపురంలో తమ మేనత్త ఇంట్లో శుభకార్యానికి మూడురోజుల క్రితం వెళ్లారు. శుభకార్యం ముగించుకుని బుధవారం స్వగ్రామం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అర్జున్ ఎసి మెకానిక్‌గా పనిచేస్తుండగా, నరేంద్ర హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండేవారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో అకాలమృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.