Thursday, May 22, 2025

ఎసిబి వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎసిబి వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, శీతలండ గ్రామానికి చెందిన ఆర్‌డబ్లూస్ ఎఈ ఇస్లావత్ వినోద్, మహబూబ్‌నగర్ జిల్లా, మక్తల్‌లో ఆర్‌డబ్లూస్ ఎఈగా గతంలో పనిచేశాడు. 7 నెలల క్రితం బదిలీలో సూర్యాపేట ఆర్‌డబ్లూస్ ఎఈగా వచ్చాడు. అయితే, గతంలో పనిచేసిన చోట మిషన్ భగీరథ పనులకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్‌కు చెందిన ఎంబి రికార్డులను తీసుకొని అక్కడికి బదిలీపై వచ్చాడు. కాంట్రాక్టర్ పనులు చేసినా బిల్లులు చేయకుండా ఎంబి రికార్డులను తన వద్దే ఉంచుకున్నాడు. ఆ బిల్లులు చేయాలంటే కోదాడ వచ్చి రూ. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎఈ వినోద్, తన అన్నకొడుకు మూర్తితో కలిసి కోదాడకు మంగళవారం కారులో వచ్చాడు. ఆ తరువాత బాధితుడి నుంచి లక్ష రూపాయలు డబ్బులు తీసుకున్న తరువాత తనను ఎవరో వెంబడిస్తున్నారని గమనించిన వినోద్, వెంటనే మూర్తికి డబ్బులు ఇచ్చి అతన్ని పారిపొమ్మని చెప్పి తాను కూడా కారులో పరారయ్యాడు.

రాత్రి తన స్వగ్రామం శీతలతండాకు రావడంతో అర్ధరాత్రి సమయంలో మహుబూబ్‌నగర్ జిల్లా ఎసిబి అధికారులు స్వయంగా గ్రామానికి వచ్చి వినోద్‌ను సూర్యాపేటకు తీసుకువెళ్ళారు. అతనిని విచారించగా లంచంగా తీసుకున్న డబ్బులను తన అన్న కొడుకు మూర్తికి ఇచ్చినట్లుగా చెప్పాడు. వివరాలు సేకరించి పంచనామా చేసుకొని వెళ్లారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం, గొట్టుముక్కుల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గంగామోహన్‌ను బుధవారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టుముక్కుల గ్రామానికి చెందిన పుప్పొడి రాజేందర్ ఇంటి అసెస్మెంట్ నెంబర్ కోసం గ్రామ కార్యదర్శిని అడుగగా రూ.20,000 డిమాండ్ చేశాడు. వారం రోజుల నుండి బాధితుడు కార్యదర్శి చుట్టూ తిరిగి చివరికి రూ.18,000 ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఎసిబి అధికారులను ఆశ్రయించగా బుధవారం మధ్యాహ్నం కార్యదర్శి లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా కార్యదర్శిపై పలు ఆరోపణలు వచ్చాయని ఎసిబి డిఎస్‌పి తెలిపారు. పట్టుబడిన పంచాయతీ కార్యదర్శిని నాంపల్లి కోర్టుకు హాజరు పరిచి చంచల్‌గూడ జైలుకు తరలిస్తామని తెలిపారు. ఈ దాడుల్లో సిఐ నాగేష్, సిబ్బంది వేణుకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News