Friday, August 29, 2025

ఎసిబి వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

ఎసిబి వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖిలా వరంగల్ తహసిల్దార్ కాగా, కరీంనగర్ జిల్లాలో ఇంటి నెంబర్ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసి, పంచాయతీ కార్యదర్శి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఖిలా వరంగల్ తహసిల్దార్ నాగేశ్వరరావు ఇంటిపైన శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయడం వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది. హనుమకొండ చైతన్యపురి కాలనీలో ఉంటున్న ఖిలా వరంగల్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు సొంత ఇంట్లో, ఖమ్మంలోని అతని మరొక ఇంటిపై అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎనిమిది చోట్ల కూడా దాడులు చేసినట్లు తెలిసింది.

ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు సుదీర్ఘకాలంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో కాజీపేట, హసన్‌పర్తి, ఖిలా వరంగల్ మండలాల తహశీల్దార్ చాలాకాలంగా పని చేశారు. హసన్‌పర్తి, కాజీపేట, గతంలో ఖిలా వరంగల్‌లో గతంలో ఆయన పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఈ విషయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలపైనే అధికారులు విచారణ చేసి ఆయన ఆస్తులపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించగా, అనేక అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తహసిల్దార్ నాగేశ్వరరావును హనుమకొండలోని ఆయన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై వరంగల్ రేంజ్ ఎసిబి డిఎస్‌పి సాంబయ్యను వివరణ కోరగా స్పందించలేదు.

టపాసులు కాల్చి గ్రామస్థుల సంబరాలు
కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, చల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుపడ్డాడు. నిర్మాణం జరిగిన ఇంటికి నెంబర్ ఇవ్వడానికి లబ్ధిదారుడు నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్‌పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం చల్లూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇదిలావుండగా, చల్లూరు పంచాయతీ కార్యదర్శి ఎసిబికి పట్టుబడ్డాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి చేరుకొని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News