ముంబై: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చల్లబడిన నేపథ్యంలో తాత్కాలికంగా రద్దైన ఐపిఎల్(IPL) మళ్లీ ప్రారంభంకానుంది. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు విదేశీ ఆటగాళ్లు తిరిగి ఐపిఎల్‌లో పాల్గొనేందుకు రాలేకపోతున్నారు. కొంతమంది ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం మే 27 వరకే అందుబాటులో ఉంటామని తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో అమ్ముడుపోని ఇతర ఆటగాళ్లతో స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకొని తమ జట్ల లోకి తీసుకోవడానికి ఫ్రాంచైజీలకు బిసిసిఐ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు ఇద్దరు ఆటగాళ్లతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
ర్యాన్ రికల్టన్, విల్ జాక్స్ వాళ్ల దేశాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో వాళ్ల స్థానంలో జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌ని ముంబై(Mumbai Indians) జట్టులోకి తీసుకుంది. బెయిర్‌స్టో గత సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. కానీ, 2025 ఐపిఎల్ వేలంలో అతన్ని తీసుకొనేందుకు ఎవరు ఆసక్తి చూపించలేదు. ఇక రిచర్డ్ గ్లీసన్ 2024 ఐపిఎల్‌లో(IPL) చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. మరి రికల్టన్, విల్ జాక్స్‌ల స్థానంలో వస్తున్న బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.