Sunday, August 31, 2025

రష్యాకు ఉక్రెయిన్ షాక్.. చౌకరకం డ్రోన్లతో వంతెనల పేల్చివేత

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఓవైపు శాంతిచర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యాకు ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. రష్యా గనులు, ఆయుధ నిల్వలను లక్షంగా చేసుకొని దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సరిహద్దు ప్రాంతంలో రష్యావైపు ఉన్న రెండు వంతెనలను చౌకరకం డ్రోన్లతో ఉక్రెయిన్ ధ్వంసం చేయడం గమనార్హం. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ బ్రిడ్జీలను రష్యా తన బలగాలకు వస్తువులు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్నట్టు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. రష్యా నిర్మించిన ఈ వంతెనలకు వ్యూహాత్మక ప్రాముఖ్యం ఉంది. ఒకవేళ ఉక్రెయిన్ దళాలు అకస్మాత్తుగా ముందుకు వస్తే వారిని నిరోధించడానికి వీటిని పేల్చేయాలని ప్రణాళికలు కూడా రచించింది. యుద్ధం సమయంలో శత్రువులను నిరోధించడానికి ఇలా సొంత మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ఓ వ్యూహం. యుద్ధం ఆరంభంలో కూడా ఉక్రెయిన్ ఇలాంటి వ్యూహాలనే అమలు చేసింది.

ఉక్రెయిన్ లోని ప్రత్యేక మోటరైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ ఈ వంతెనల కూల్చివేత ఆపరేషన్‌ను చేపట్టింది. వంతెనలో ఒక దాని చుట్టూ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించామని అధికారులు వెల్లడించారు. అక్కడ ఏదో జరుగుతుందని తెలిసిన అనంతరం , సిగ్నల్స్ కూడా అదృశ్యమవుతుండడంతో నిఘా డ్రోన్‌ను తాము అక్కడికి పంపించలేకపోయినట్టు తెలిపారు. దీంతో ఫైబర్ ఆప్టిక్స్‌తో కూడిన ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్‌ను ప్రయోగించినట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. అక్కడ తాము పేలుడు పదార్థాలను చూశామని అధికారులు తెలిపారు. డ్రోన్ వాటి పైకి దూసుకెళ్లడంతో భారీ పేలుడు సంభవించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడ మరో బ్రిడ్జ్ కనిపించిందని , దానిని కూడా పేల్చివేసినట్టు చెప్పారు. అసాధారణ పద్ధతుల్లో రెండు వంతెనల కూల్చివేత కీవ్ అరుదైన విజయగాథను సూచిస్తుందని బ్రిగేడ్ ప్రతినిధి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News