అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 జులై 8వ తేదీ నాటికి అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారతదేశానికి గడువు విధించిన నేపథ్యంలో వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత బృందం, జేమీసన్ గ్రియర్ నేతృత్వంలోని అమెరికా బృందంతో వాషింగ్టన్‌లో 2 రోజుల చర్చలు జరిపింది. గోయల్ రెండు రోజుల క్రితం తిరిగి భారత దేశానికి వచ్చినప్పటికీ, వాణిజ్య కార్యదర్శి ఇంకా అమెరికాలో ఉన్నసమయంలో ట్రంప్ ఏకపక్షంగా భారతదేశంతో ఒక పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాడు. ఇందులో భారతదేశాన్ని మరింత తెరవాలని స్పష్టమైన సందేశం ఉంది. అయితే వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇది ట్రంప్ 2025 మే 10న ప్రకటించిన అమెరికా -మధ్యవర్తిగా ఇండో -పాక్ కాల్పుల విరమణ, దానితో అనుసంధానించిన అమెరికా- భారత వాణిజ్య ఒప్పంద ప్రకటన కొనసాగింపే.
ఇది మరోసారి ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపించిన మోడీ పాలన అమెరికా సామ్రాజ్యవాదానికి చేసిన దౌర్భాగ్యకర నయా వలసవాదానికి తలవంచే విధానాన్ని బయటపెడుతోంది. 2025 ఏప్రిల్ 2న ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక షరతులు, పరిమితులు విధిస్తూ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశంలో భాగంగా ఉక్కు, అల్యూమినియంలపై 26% పన్నులు విధించడమే కాకుండా, భారత్‌లో తమ మార్కెట్‌కు (market India) అడ్డంకులు లేని ప్రవేశం కోసం డిమాండ్ చేశారు. ప్రపంచంలోని తూర్పున చైనా నుండి పశ్చిమ యూరప్, కెనడా వరకు పలు దేశాలు వెంటనే ప్రతిచర్యలు ప్రకటించాయి.లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్రికా దేశాలు కూడా ఈ ఏకపక్ష ట్రంప్ పన్నుల విధింపునకు వ్యతిరేకంగా గళమెత్తాయి. చైనా కౌంటర్ (ప్రత్యర్థిగా పన్నులుగా విధానానికి) టారిఫ్‌లకు ప్రతిచర్యగా ట్రంప్ చైనాతో రెండు దఫాల చర్చలతర్వాత వాణిజ్య ఒప్పందానికి వెళ్లాల్సి వచ్చింది.
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి మాటలు పలికే మోడీ మాత్రం ట్రంప్ ఏకపక్షంగా బెదిరించే పద్ధతిలో పన్నులను విధించటం గురించి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో భారతదేశంలో తక్కువ వేతనంతో పని చేసే రంగాలైన టెక్స్‌టైల్, రత్నాభరణాలు, చర్మవస్తువులు, వస్త్రాలు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటిపండ్లపై అదనపు 26% పన్నుల నుండి పూర్తి మినహాయింపు కోసం వేడుకుంటుంటే, అమెరికా మాత్రం అధునాతన సాఫ్ట్‌వేర్‌లు, పరిశ్రమల వస్తువులు, ఆటో లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రో రసాయన ఉత్పత్తులు, వైన్, పాల ఉత్పత్తులు, ఆపిల్స్, ఇంతటితోనే కాకుండా జన్యుపరిణామం చేసిన పంటలపై డ్యూటీ మినహాయింపులు కోరుతోంది.
ఈ ఒప్పందం ద్వారా 2025లో 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇరు దేశాల వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలన్నది లక్ష్యం. ఈ కొత్త ఒప్పందాన్ని 2025 జులై 8న ప్రకటించే అవకాశం ఉంది. స్వతంత్ర పరిశీలకుల ప్రకారం ట్రంప్ భారతదేశాన్ని మరింతగా తెరవాలి ‘ఓపెన్ అప్ ఇండియా’ అనేది ‘స్టార్టప్ ఇండియా’ చొరవను సూచిస్తుంది. ఇది స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చే పర్యావరణ వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రధాన కార్యక్రమం. వ్యవస్థాపకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశాన్ని ఉద్యోగ సృష్టికర్తల దేశంగా మార్చడం దీని లక్ష్యం. ఈ చొరవ పన్ను మినహాయింపులు, నిధులకు సులభమైన ప్రాప్యత, మేధో సంపత్తి రక్షణకు మద్దతు వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. కొత్తప్రకటన ఆధారంగా మోడీ పాలన అమెరికా ఉత్పత్తుల కోసం ఎర్రతివాచి పరచడానికి సిద్ధమవుతోంది.
2020 నివేదిక ప్రకారం ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో భారతదేశం 190 దేశాలలో 63వ స్థానంలో ఉంది. 2014లో 142వ స్థానం నుండి ఇది గణనీయమైన మెరుగుదల. 2021లో ప్రపంచ బ్యాంకు ఈ నివేదికను నిలిపివేసింది. కానీ అప్పటి వరకు భారతదేశం సాధించిన పురోగతి నియంత్రణ సంస్కరణలకు, మరింత వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో దాని నిబద్ధతను హైలైట్ చేసింది. ఫలితంగా భారత ఔషధ పరిశ్రమపై తీవ్ర ప్రభావంపడడం, డిజిటలైజేషన్, కృత్రిమ మేధ (ఎఐ)వంటి సాంకేతిక విధానాలలో భారత్ కష్టపడి సాధించిన పురోగతిని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడుతాయి. సోయాబీన్, మొక్కజొన్న, ఆపిల్స్, పాలు మొదలైన వాటిపై అమెరికా ఒత్తిడి వల్ల వచ్చే కొత్త పన్ను మినహాయింపుల మొదటగా నష్టపోయేది,బలిపశువులు అయ్యేది రైతాంగమే.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై తక్కువ పన్నులు, జిపి -(జెనిటికల్లి మాడిఫైడ్ -జన్యుపరంగా మార్పిడి చేయబడింది- ఉదాహరణకు బిటి విత్తనాలు–) విత్తనాల స్వేచ్ఛా ప్రవేశం, అమెరికా అగ్రిబిజినెస్, బహుళజాతి కంపెనీల (ఎంఎన్‌సిల) స్వేచ్ఛా విస్తరణ భారత వ్యవసాయానికి ఘోర విపత్తుకావడం ఖాయం. ఇది 2020 సెప్టెంబర్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ఆదేశాల ప్రకారం కొవిడ్ సమయంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను గుర్తుకు తెస్తోంది. అదే విధంగా రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా -భారత పౌర అణు ఒప్పందాన్ని (సివిల్ న్యూక్లియర్ ఒప్పందాన్ని)కూడా ఈ వాణిజ్య ఒప్పందానికి అనుబంధంగా కలిపారు.
దీనిలో భాగంగా అణుశక్తి చట్టాన్ని( అటామిక్ ఎనర్జీ చట్టం) సవరించడం, ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, న్యూక్లియర్ ప్రమాదం జరిగితే కంపెనీల బాధ్యతను తగ్గించేలా సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ (అణు నష్టానికి పౌర బాధ్యత చట్టాన్ని-) చట్టాన్ని సవరించడం మోడీ ప్రభుత్వం ప్రతిజ్ఞాబద్ధమైంది. 2025 బడ్జెట్‌లో విదేశీ న్యూక్లియర్ సంస్థలకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు నిర్మించడానికి మార్గం ఇచ్చినది. సారాంశంగా చెప్పాలంటే మోడీ పాలనకు ఉన్న అమెరికా సామ్రాజ్యవాద విధేయతే ఈ ట్రంప్ విధానాలకు లొంగిపోవడంలో ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో రైతులు, కార్మికులు, అశేష భారత ప్రజల జీవనాధారాలను తృణప్రాయంగా విస్మరించి అమెరికా సామ్రాజ్యవాదానికి బానిసగా మారటం అత్యంత దురదృష్టకరం.
- కొల్లిపర వెంకటేశ్వరరావు, 93923 25652