లక్ష కోట్లతో పరిశోధన, అభివృద్ధి,
ఆవిష్కరణ పథకం ఉపాధి
ఆధారిత ప్రోత్సాహకాలకు మరో
లక్ష కోట్లు కేంద్ర కేబినెట్ కీలక
నిర్ణయాలు వివరాలు వెల్లడించిన
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్రమంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశోధనాభివృద్ధి,ఆవిష్కరణల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్షంగా పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ( ఆర్‌డిఐ) పథకానికి ఆమోదం తెలిపింది.ఈ పథకానికి రూ.లక్ష కోట్లు కేటాయించడానికి పచ్చజెండా ఊపింది. ఆర్‌డిఐలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదా వడ్డీరహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీ ఫైనాన్సింగ్ అందించడమే ఈ పథకం లక్షమని కేబినెట్ సమావేశం అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రైవేటు రంగం నిధుల విషయంలో ఎదుర్కొంటున్న అడ్డంకులు, సవాళ్లను అధిగమించడమే ఈ పథకం లక్షమని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న అనుసంధాన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ పాలక మండలి ఆర్‌డిఐ పథకానికి దిశానిర్దేశం చేస్తుందని వైష్ణవ్ తెలిపారు.
దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం, క్రీడాకారుల పమగ్రాభివృద్ధే లక్షంగా జాతీయ క్రీడా విధానం2025కే కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. అట్టడుగు స్థాయినుంచి ఉన్నతస్థాయి వరకు ప్రతిభను ప్రోత్సహించడం, కోచింగ్‌కు ప్రాప్యతను మెరుగుపర్చ డం, దేశ క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం పాలసీ లక్షమని మంత్రి తెలిపారు. క్రీడల్లో యువ అథ్లెట్లు ప్రపంచ వేదికలపై పోటీ పడి విజయం సాధించేందుకు క్రీడాపాలసీ అవకాశం కల్పిస్తుందన్నారు.
ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం
దీంతో పాటుగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మొత్తం రూ.1.07 లక్షల కోట్లతో అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో రెండు భాగాలున్నాయని చెప్పారు. కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఉంటాయని, దీర్ఘకాలిక శ్రామికశక్తిని కొనసాగించే వ్యాపారులకు ప్రతిఫలం ఇవ్వడం ద్వారా స్థిరమైన ఉపాధికి మద్దతు ఇస్తుందన్నారు.గత కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉండే సమగ్ర ప్యాకేజి ఇదని మంత్రి చెప్పారు. ఈ పథకం భారత దేశ తయారీ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి చెప్పారు. 2025 ఆగస్టు 1నుంచి 2027 జులై 31 వరకు సృష్టించే కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు ప్రతి ఉద్యోగానికి ప్రతినెలా రూ.3 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని రెండేళ్ల పాటు ప్రభుత్వం చెల్లిస్తుంది.తమిళనాడులోని జాతీయ రహదారిలోని పరమకుడి రామనాథపురం సెక్షన్‌ను నాలుగు లేన్లుగా మార్చడానికికూడా కేంద్రం ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.