న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది. వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్షంగా ఏటా రూ. 24 వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్‌ని అమలు చేయనున్నారు. 202526 నుంచి ఆరేళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా దీన్ని చేపట్టనున్నారు. అలాగే పునరుత్పాదక ఇంధనంలో ఎన్‌టీపీసీకి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రోదసీలో 18 రోజులు గడిపి అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
పీఎం ధన్‌ధాన్య కృషి యోజన ఇలా…
వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ , స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంటకోత తర్వాత గ్రామస్థాయిల్లో దిగుబడులను నిల్వ చేసేందుకు గోదాముల సదుపాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడమే లక్షంగా పీఎం ధన్‌ధాన్య కృషి యోజనను రూపొందించారు. ఈ కార్యక్రమం కోసం ఏటా రూ. 24 వేల కోట్ల వ్యయం చేయనున్నారు. మొత్తం 11 శాఖల్లో 36 పథకాలు , రాష్ట్రం లోని ఇతర పథకాలు, ప్రైవేటు రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని రుతువుల్లోనూ పంట సాగుబడి చేయకపోవడం , రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉండటం అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తారు. ఈ పథకం సమర్ధవంతంగా అమలు జరిగేలా పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిధన్‌ధాన్య జిల్లాలో ఈ పథకం పురోగతిని 117 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. దీని ద్వారా ఏటా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నట్టు అంచనా.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మరింత ప్రోత్సాహం
ఎన్‌టిపిసి అనుబంధ సంస్థ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను మరింత అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపింది. ఎన్‌టిపిసికి అధికారాల పరిధిని పెంచడానికి ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈమేరకు ఎన్‌టిపిసీకి రూ. 20 వేల కోట్ల వరకు పెట్టుబడి పరిధిని విస్తరించింది. అలాగే ఎన్‌ఎల్‌సిఎల్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రూ. 7 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించింది. ఈమేరకు 2032 నాటికి 60 గిగావాట్ విద్యుత్ ఉత్పాదకత సాధించాలని లక్షం నిర్ణయించింది. మహారత్న కంపెనీ పునరుత్పాదక ఇంధనానికి ప్రస్తుత పెట్టుబడి రూ. 7500 కోట్లకు పరిమితం చేసింది. ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సిఐఎల్) తన యాజమాన్యం లోని అనుబంధ సంస్థ ఎన్‌ఎల్‌సి ఇండియా రెన్యుబల్స్‌లిమిటెట్ (ఎన్‌ఐఆర్‌ఎల్)కు రూ.7000 వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది. తిరిగి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వివిధ ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా, లేదా ఉమ్మడి భాగస్వామ్యంగా పెట్టుబడి పెట్టవచ్చు.