కాగజ్‌నగర్, అంబర్‌పేట వేదికలుగా వివిధ రహదారి
ప్రాజెక్టులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు: కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో రహదారి మౌళిక సదుపాయాల కల్పనకు అతిపెద్ద ముందడుగు పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న రూ.5,413 కోట్ల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభం, భూమిపూజ చేయనున్నారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రహదారి ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తాయని, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని వివరించారు. దృఢమైన, భవిష్యత్ అవసరాలను తీర్చగలిగే మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతర సహకారాన్ని అందిస్తూనే ఉంటుందని వివరించారు.
తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానినని పేర్కొన్నారు. నితిన్ గడ్కరీ చేతుల మీదుగా సుమారు రూ.5,413 కోట్లతో 167 కి.మీ. మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగే కార్యక్రమంలో, అలాగే హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ రెండు చోట్ల నుంచి వేర్వేరు కార్యక్రమాలను నితిన్ గడ్కరీ వర్చువల్‌గా భూమిపూజతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని కిషన్‌రెడ్డి వివరించారు. సిర్పూర్ -కాగజ్‌నగర్ ప్రాజెక్టు విలువ రూ.3,862 కోట్లు ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
రూ.3,694 కోట్ల వ్యయంతో 123 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహదారుల ప్రారంభోత్సవం, రూ.168.47 కోట్ల వ్యయంతో 8.1 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రహదారికి భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రాజెక్టు విలువ రూ.1,552.91 కోట్లు అని తెలిపారు. రూ.895.64 కోట్ల వ్యయంతో 22.57 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహదారుల ప్రారంభోత్సం, రూ.657.27 కోట్ల వ్యయంతో 20.87 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రహదారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల వారీగా వివరాలు
ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 3,694 కోట్లతో సుమారు 5 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం జరగనుంది. నిర్మల్- ఖానాపూర్ మధ్యలో 17.79 కి.మీ. మేర రోడ్డు వెడెల్పు పనులు పూర్తయ్యాయి. దీనికి ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే మంచిర్యాల్ -రేపల్లెవాడ మధ్యలో 42 కి.మీ. మేర రూ.2001 కోట్లతో నాలుగు వరుసల పనులు పూర్తయ్యాయి, రేపల్లె నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ మేర రూ 1,525 కోట్లతో నాలుగు వరుసల పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. నాగ్‌పూర్- హైదరాబాద్ సెక్షన్‌లో కడ్తాల్ వద్ద రూ.23.54 కోట్లతో పూర్తయిన ఆరు లైన్ల అండర్ పాస్ పనులు ప్రారంభిస్తారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్‌పూర్ -హైదరాబాద్ సెక్షన్‌లో సర్వీస్ రోడ్లు, జంక్షన్ల మార్పుల పనులు (నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో) పూర్తయ్యాయి.
వీటిని కూడా నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్‌పూర్ -హైదరాబాద్ సెక్షన్‌లో 1. ఆరాంఘర్ – శంషాబాద్ మధ్యలో 10 కిలోమీటర్ల మేర ఆరు వరుసల పనులకు భూమిపూజలో నితిన్ గడ్కరీ పాల్గొంటారు. 202వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌లోని అంబర్ పేట 6 నెంబర్. జంక్షన్ వద్ద 1.47 కిలోమీటర్ల మేర రూ.415 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌కు ప్రారంభోత్సవం చేస్తారు. 65వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ లోని బిహెచ్‌ఇఎల్ జంక్షన్ వద్ద రూ.172.56 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌కు ప్రారంభోత్సవం, 44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్‌పూర్ – హైదరాబాద్ సెక్షన్‌లో మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద ఆరు వరుసల అండర్ పాస్, సర్వీస్ రోడ్డును నితిన్ గడ్కరీ ప్రారంభోత్సవం చేస్తారు.
44వ నెంబరు జాతీయ రహదారిపై నాగపూర్ – హైదరాబాద్ సెక్షన్‌లో మెదక్ జిల్లా జాప్తిశివనూర్ గ్రామం వద్ద నిర్మించిన అండర్ పాస్, సర్వీస్ రోడ్డు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి పాల్గొంటారు. 44వ జాతీయ రహదారిపై నాగపూర్ – హైదరాబాద్ సెక్షన్‌లో మెదక్ జిల్లా గోల్డెన్ ధాబా వై జంక్షన్ వద్ద ఆరు వరుసల అండర్ పాస్ ప్రారంభోత్సవం చేస్తారు. అదే జాతీయ రహదారిపై నాగపూర్ హైదరాబాద్ సెక్షన్లో కామారెడ్డి జిల్లా టెక్రియాల్, పొందుర్తి క్రాస్ రోడ్స్ వద్ద పూర్తయిన అండర్ పాస్ పనులను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. నాగపూర్ – హైదరాబాద్ సెక్షన్‌లోని కామారెడ్డి జిల్లా పద్మాజివాడ జంక్షన్ వద్ద అండర్ పాస్, స్లిప్ రోడ్డుకు కూడా ప్రారంభోత్సవం చేస్తారు. 163 నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ – వరంగల్ సెక్షన్‌లో ఆలేరు-జీడికల్ క్రాస్ రోడ్స్ వద్ద ఆరు వరుసల అండర్ పాస్‌ను అంబర్‌పేట్ నుంచి కేంద్రమంత్రి గడ్కరీ వర్చువల్ గా ప్రారంభిస్తారు.
హైదరాబాద్-విజయవాడ సెక్షన్‌లో
హైదరాబాద్- విజయవాడ సెక్షన్‌లో టేకుమట్ల సమీపంలో రూ.10.69 కిలో మీటర్ల మేర రూ.422.12 కోట్లతో జంక్షన్ తొలగింపు, ప్రయాణికుల రవాణా సదుపాయాల సౌలభ్యం కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భూమిపూజ చేస్తారు. ధర్మోజిగూడ వద్ద రూ.37.68 కోట్లతో ఆరు వరుసల అండర్ పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం భూమిపూజ చేస్తారు. హైదరాబాద్ – బెంగళూరు సెక్షన్‌లో బాలానగర్ వద్ద రూ.31.56 కోట్లతో ఆరు వరుసల అండర్ పాస్‌కు శంకుస్థాపన చేస్తారు.
హైదరాబాద్- యాదగిరి సెక్షన్‌లో అంకుశాపూర్ వద్ద ఆరు వరుసల అండర్ పాస్‌కు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్- యాదగిరి సెక్షన్‌లో అంకుశాపూర్ వద్ద ఆరు వరుసల అండర్ పాస్ వద్ద భూమిపూజ చేస్తారు. హైదరాబాద్- యాదగిరి సెక్షన్‌లో ఘట్కేసర్ జంక్షన్ వద్ద రూ.68 కోట్లతో ఆరు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూమిపూజలో పాల్గొంటారు. నాగపూర్ హైదరాబాద్ సెక్షన్‌లో కోమట్పల్లి జంక్షన్, వల్లూరు జంక్షన్‌ల అభివృద్ధి, ఆరు వరుసల అండరర్ పాస్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.