తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (17న) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన శనివారం బర్కత్‌పురాలోని పార్టీ నగర శాఖ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయ్ విగ్రహాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నందున ఏర్పాట్లపై వారు చర్చించారు.
అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2022 సంవత్సరం నుంచి కేంద్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నది. 2022, 2023 సంవత్సరాల్లో కేంద్ర హోం మంత్రి అమీత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత ఏడాది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు.