తన అందచందాలతో యువకులను ఆకర్షించి.. వారిని పెళ్లి చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత వారు కష్టపడి సంపాదించిన డబ్బు, ఆభరణాలతో పరారవుతోంది ఓ నిత్య పెళ్లికూతురు. ఇలా 25 మంది యువకులను కిలేడీ బురడి కొట్టించింది. వారి నుంచి లక్షల రూపాయల నగదుతో పారిపోయింది. ఎట్టకేలకు మంగళవారం సదరు మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనురాధ అనే మహిళ పెళ్లి పేరుతో తనను మోసం చేసి డబ్బు నగలతో పారిపోయిందని మే 3న విష్ణు శర్మ అనే వ్యక్తి రాజస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సునీత, రాజస్థాన్‌కు చెందిన పప్పు మీనా అనే ఇద్దరు వ్యక్తులు తనకు తగిన వధువును వెతుకుతామని హామీ ఇచ్చి అనురాధ ఫోటోను చూపించారని విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను వివాహం చేసుకోవడానికి తన దగ్గర నుంచి సునీత, పప్పు ఏప్రిల్ 20న సవాయి మాధోపూర్ కోర్టు ప్రాంగణంలో రూ. 2 లక్షలు వసూలు చేశారని విష్ణు తెలిపాడు. అయితే, వివాహం జరిగిన 12 రోజులకే, అనురాధ.. నగలు, నగదు, మొబైల్ ఫోన్‌తో పారిపోయిందని పోలీసులకు చెప్పాడు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనురాధ.. భోపాల్‌లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ASI యాదవ్ తన బృందంతో కలిసి భోపాల్‌కు వెళ్లారు. అక్కడ ఒక కానిస్టేబుల్ కాబోయే వరుడిగా నటిస్తూ.. వివాహ బ్రోకర్లను సంప్రదించాడు. ఓ బ్రోకర్ కాబోయే వధువుల ఫోటోలను చూపించగా.. అందులో అనురాధ కూడా ఉండటంతో.. ఆమెను చూపించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత ఆమెను అరెస్ట్ చేసి రాజస్థాన్‌కు తీసుకువచ్చారు. “ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన అనురాధ.. సునీత, పప్పు వంటి వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వారు స్థానిక ఏజెంట్ల ద్వారా కాబోయే వరులను సంప్రదించి.. పెళ్లికి ముందే యువకుల నుంచి రూ. 2–5 లక్షల వరకు డిమాండ్ చేస్తారు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, నగదు, ఆభరణాలతో పారిపోయేవారు” అని పోలీసులు తెలిపారు.