పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకుంది. ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేసే మొహద్ హరూన్‌ను నోయిడాలో అదుపు లోకి తీసుకున్నారు. అతడికి పాకిస్థాన్ దౌత్య కార్యాలయం లోని ముజమ్మల్ హుస్సేన్‌తో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఇతడు వీసా కోసం డబ్బులు, ఇతర సున్నిత సమాచారం చేరవేయడంతోపాటు , తీవ్రవాద భావజాల వ్యాప్తికి పాల్పడుతున్నట్టు అనుమానం. హరూన్‌కు పాక్ దౌత్య సిబ్బంది అయిన ముజమ్మిల్‌తో బలమైన సంబంధాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వారు నిత్యం కాంటాక్ట్‌లో ఉన్నట్టు గుర్తించారు.న హరూన్‌కు పాకిస్థాన్‌లో బంధుత్వాలు ఉండటంతో ముజమ్మిల్ వీసాలను ఇప్పించినట్టు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక హరూన్ పాక్ వీసాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు గుర్తించారు.
ఆ సొమ్ములో కొంత కమిషన్ తీసుకొని ముజమ్మిల్ చెప్పిన వ్యక్తులకు మిగిలిన మొత్తం ఇచ్చేవాడు. అతడు పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్నట్టు తెలిసినా, హరూన్ సహకరించాడని ఏటీఎస్ బృందం చెబుతోంది. దీంతో సున్నితమైన సమాచారం చేరవేసి ఉండొచ్చని సమాచారం. ఇటీవలే ప్రభుత్వం ముజమ్మిల్ హుస్సేన్‌ను అనుమానిత వ్యక్తిగా ప్రకటించిన భారత్, అతడిని స్వదేశానికి తిరిగి పంపింది.ఇక ఆదంపూర్ , వారణాసిల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో ఏటీఎస్ బృందం తుఫేల్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేసింది.న అతడు దేశ వ్యతిరేక వాట్సాప్ గ్రూప్‌లో చేరినట్టు గుర్తించారు. దీనిని పాకిస్థాన్ లోని సంస్థలు నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు అతడు సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందించినట్టు గుర్తించారు. “ తుఫేల్ పాకిస్థాన్ లోని వ్యక్తులు, సంస్థలతో సంబంధాలు నెరుపుతున్నారు. పాక్‌లో నిషేధానికి గురైన తెహ్రీక్ ఏ లబ్బేక్ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా షాద్ రిజ్వీ వీడియోలను తరచూ షేర్ చేస్తున్నట్టు గుర్తించారు.
గజ్వా ఏ హింద్‌కు సంబంధించిన కంటెంట్‌ను అతడు ప్రమోట్ చేస్తున్నాడు. భారత్‌లో షరియా చట్టం తీసుకురావడం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నాడు. వారణాసి లోని రాజ్‌ఘాట్, నమోఘాట్ జ్ఞానవాపి మసీదు, వారణాసి రైల్వేస్టేషన్,జామా మసీదు, ఎర్రకోట, నిజాముద్దీన్ ఫోటోలను పాక్ వ్యక్తులకు షేర్ చేశాడు ” అని ఏటీఎస్ వెల్లడించింది. అతడికి పాకిస్థాన్ లోని దాదాపు 600 మందితో సంబంధాలు ఉన్నాయి. ఇక ఫైసలాబాద్ లోని నఫీస అనే మహిళతో కూడా అతడు సంభాషిస్తున్నాడు. ఆమె భర్త పాక్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ రెండు కేసులపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.