నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) యుపిఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు సోమవారం (సెప్టెంబర్ 15) నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సాధారణ వినియోగదారులతో పాటు వర్తకులు, వ్యాపారులకు కూడా ఉపయోగపడనున్నాయి. ఇప్పటి వరకు యుపిఐ ద్వారా వ్యక్తిగత లావాదేవీలకు గరిష్ట పరిమితి రోజుకు రూ.1 లక్ష ఉండేది. ఈ పరిమితిలో ఎటువంటి మార్పులు లేవు. అయితే కొన్ని ప్రత్యేక విభాగాలకు మాత్రం యుపిఐ ద్వారా లావాదేవీ పరిమితిని గణనీయంగా పెంచారు. క్యాపిటల్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎం), ట్రావెల్ విభాగాల్లో ఒక్క లావాదేవీకి గరిష్టంగా రూ.5 లక్షల వరకు అవకాశం కల్పించారు.
వీటిలో రోజువారీ గరిష్ట లావాదేవీ పరిమితి రూ.10 లక్షలుగా నిర్ణయించారు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు, జువెలరీ విభాగాల్లో ఒక్క లావాదేవీ పరిమితి రూ.5 లక్షలు కాగా రోజువారీ పరిమితి రూ.6 లక్షలుగా నిర్ణయించారు. బిజినెస్, మెర్చంట్ పేమెంట్స్‌లో ఒక్క లావాదేవీకి రూ.5 లక్షల వరకు పరిమితి ఉంది. కానీ రోజువారీ లావాదేవీలకు గరిష్ట పరిమితి మాత్రం నిర్ణయించలేదు. డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్‌లో ఒక్క లావాదేవీ పరిమితి, రోజువారీ లావాదేవీ పరిమితి రెండూ రూ.5 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ వ్యక్తిగత (పి2పి) లావాదేవీలకు మాత్రం మార్పులు లేవు. రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకే పరిమితి కొనసాగుతుంది.
Also Read: కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి