మన తెలంగాణ/ఉప్పల్/బోడుప్పల్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్)పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి బుధవారం ఉప్పల్ కారిడార్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్‌ను పరిశీలించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి నారపల్లి వరకు చేపట్టిన నిర్మాణ పనుల్లో నిధుల కొరత వల్ల జాప్యం జరిగిందన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి ఒప్పించి తిరిగి పనులు ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పనుల విషయంలో కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ప నులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెం చి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నగరంలో పివి ఎక్స్‌ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్‌గా ఉప్పల్ ఫ్లైఓవర్ అని చెప్పారు.
2026 దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. సిఎంఆర్ నుండి రింగ్ రోడ్డు మీదుగా రామంతాపూర్ రహదారిలోని డీఎస్‌ఎల్ మాల్ వరకు జీహెచ్‌ఎంసి నిధులతో ప్రారంభమై అర్థంతరంగా నిలిచిపోయిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించాలని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ కర్ణన్‌కు ఫోన్‌లో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు రామకృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.
ఫ్లై ఓవర్ వద్దు.. అండర్ పాస్ ముద్దు..
హబ్సిగూడ రహదారిలో ఉన్న క్రికెట్ స్టేడియం నుండి నాగోలు వెళ్లే ఆర్టీవో ఆఫీస్ వరకు జీహెచ్‌ఎంసి నిధులతో నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్ పనులకు స్వస్తి పలికి ఎల్బీనగర్ తరహాలో ఉప్పల్ రింగ్ రోడ్డులో అండర్ పాస్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు. ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల భవనాలు కోల్పోయి ఉప్పల్ ప్రజలు చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.