పిఏసిఎస్ అధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ
కట్టంగూర్ మండలానికి 333 యూరియా బస్తాలు … వచ్చింది 400 మంది రైతులు
ఒక్కో రైతుకు ఒకటి లేదా రెండు చొప్పున యూరియా బస్తాలు పంపిణీ
మనతెలంగాణ/కట్టంగూర్ : కట్టంగూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికి సబ్సీడీ యూరియా వచ్చిందన్న విషయం మండలంలోని ఆయా గ్రామాల రైతులకు సమాచారం తెలియడంతో గురువారం పిఏసిఎస్ గోదాం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా ఆయకట్టు రైతులు వరి సాగు కొంత ఆలస్యంగా చేయడంతో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టంగూర్ మండలానికి 333 బస్తాల భారత్ సన్న యూరియా వచ్చిందన్న సమాచారం రావడంతో సూమారు 400 మంది రైతులు పిఏసిఎస్ గోదాం వద్దకు కార్యాలయ సమయానికి ముందే బారులు తీరారు. దీంతో కార్యాలయ ఆవరణంతా రైతులతో కిక్కిరిసిపోయింది.
జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు మండల ప్రత్యేక అధికారి సతీష్, ఏఓ గిరి ప్రసాద్, ఎస్‌ఐ రవీందర్ ల సమక్షంలో పోలీస్ బందోబస్తు మధ్య రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా క్యూ పద్దతిలో ఉంచి, పట్టాదారు పుస్తకం, ఆధార్‌కార్డు ఆధారంగా ఒక్కో రైతుకు ఒకటి లేదా రెండు యూరియా బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మరి కొంత మంది రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగి పోయారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ పలువురు అధికారులతో కలిసి నానో యూరియా బాటిల్స్‌ను ప్రదర్శించడం జరిగింది. రైతులు యూరియా కు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ను ఎకరానికి అరలీటర్ ( 500 ఎంఎల్) చొప్పున పై పాటుగా పిచికారి చేసుకున్నట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే పంట దిగుబడిలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా సరైన దిగుబడిని పొందవచ్చునని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల జిఎం సతీష్, ఏఓ గిరి ప్రసాద్, ఎస్‌ఐ రవీందర్, పిఏసిఎస్ కార్యదర్శి బండ మల్లారెడ్డి,పోలీస్ సిబ్బంది, పిఏసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.