Tuesday, August 26, 2025

తెలంగాణలో యూరియా సంక్షోభం: సవాళ్లు

- Advertisement -
- Advertisement -

వ్యవసాయాధార తెలంగాణ రాష్ట్రం యూరియా సంక్షోభంలో చిక్కుకున్నదా? నిజంగానే కొరత ఉన్నదా? రాజకీయావసరాలు కొరతను తీవ్రం చేస్తున్నాయా? రైతు ఆందోళనను మరింత జటిలం చేసేకన్నా సమస్యను పరిష్కరించే మార్గాలు అన్వేషించే ప్రయత్నం జరుగుతున్నదా. మోతాదుకు మించిన ఎరువుల వాడకం దీర్ఘకాలిక వ్యవసాయ నష్టాలకు కారణం కాకుండా ప్రయత్నం చేయవచ్చు గదా.. తెలంగాణ ఒక వ్యవసాయ రాష్ట్రం, ఇక్కడ వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు విస్తృతంగా పండిస్తారు. ఈ పంటలు ఏపుగా ఎదగడానికి రైతులు యూరియాతోబాటు ఒక్క నైట్రోజన్ ఎరువుపై ఎక్కువగా ఆధారపడతారు. 2025 ఖరీఫ్ సీజన్‌లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్), మంచి వర్షాలు కురిసి శ్రీరామ్‌సాగర్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో సరిపడా నీరు వచ్చిన కారణంగా 118 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది.

ఇది గత సంవత్సరం కంటే 27% ఎక్కువ. అయితే, యూరియా కొరత వల్ల రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు, నిరసనలు చేస్తున్నారు, అలాగే పంట నష్టాల (Crop losses) గురించి ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో ఎకరానికి 170-173 కిలోల ఎరువు వినియోగం ఉంది. ఇది జాతీయ సగటు (100- 120 కిలోలు) కంటే ఎక్కువ. ఈ వ్యాసం తెలంగాణ యూరియా అవసరాలు, కొరతకు కారణాలు, వివిధ వర్గాల అభిప్రాయాలు, పరిష్కార మార్గాలను వివరించే ప్రయత్నం చేస్తున్నది. 2025 ఖరీఫ్ సీజన్‌కు కేంద్రం తెలంగాణకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటి) యూరియా కేటాయించింది. దేశవ్యాప్తంగా 65 మిలియన్ టన్నుల ఎరువులలో భాగంగానే కేటాయింపులు జరిగాయి. అయితే, రాష్ట్ర వ్యవసాయ అధికారులు ఇక్కడి పంటలకోసం 10.48 ఎల్‌ఎంటి అవసరమని చెబుతున్నారు.

సాగు విస్తీర్ణం పెరిగడం వల్ల అదనపు అవసరాలు కావాలనేది వాళ్ల వాదన. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి, 44.64 లక్షల ఎకరాలు పత్తి పంట, 5.97 లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట ఈ సీజన్‌లో ఖాస్తు జరుగుతున్నది. ఈ పంటల కోసం ఏప్రిల్ నుంచి ఆగస్టు 2025 వరకు, 8.3 ఎల్‌ఎంటి కేటాయించినప్పటికీ, కేవలం 5.32-5.42 ఎల్‌ఎంటి మాత్రమే సరఫరా అయింది. మిగతా 2.69-3 ఎల్‌ఎంటి కొరత ఏర్పడింది. జిల్లాల వారీగా పరిశీలించినప్పుడు మహబూబాబాద్‌లో 40,500 ఎంటి అవసరమైతే 18,100 ఎంటి మాత్రమే సరఫరా అయింది. నల్గొండకు 43,450 ఎంటి అవసరమైతే 27,000 ఎంటి మాత్రమే వచ్చింది. ఈ కొరత వల్ల 53.51 లక్షల హెక్టార్లలో 10-15% పంట నష్టం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా కొరతకు అనేక కారణాలున్నాయి.

పంపిణీ లోపాల పర్యవసానంగా మెదక్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఉదయం నుంచి క్యూలో నిలబడుతూ ఇబ్బందుల పాలయినట్టు అక్కడి వార్తలు చెబుతున్నాయి. ఒక్కో ఆధార్ కార్డుకు ఒకటి లేదా రెండు 45- కిలోల బస్తాలు మాత్రమే లభిస్తాయి. దీని వల్ల నిరసనలు, రోడ్డు ఆందోళనలు జరుగుతున్నాయి. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలు కూడా యూరియా సంక్షోభానికి ప్రధాన కారణాలు. యూరియాసబ్సిడీ ధర రూ. 266.50, కానీ బ్లాక్ మార్కెట్లో రూ. 325- 400కు అమ్ముతున్నారు. డీలర్లు, మధ్యవర్తులు, కొందరు రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నవారు యూరియాను నిల్వ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వ్యవసాయేతర రంగాలకు యూరియా వాడకం పెరగడం కూడా ఇప్పటి కొరతకు కారణం. సబ్సిడీ యూరియా వ్యవసాయానికి బదులు డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డిఇఎఫ్), ప్లైవుడ్ రెసిన్లు, ఔషధాల తయారీకి ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని రవాణా, ఔషధ పరిశ్రమలు ఈ సమస్యను పెంచుతున్నాయి. ఉత్పత్తి, సరఫరా సమస్యలు ఇప్పటి యూరియా సంక్షోభానికి మూలకారణం. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) యూనిట్ గ్యాస్ లీక్లు, సాంకేతిక సమస్యల కారణంగా 78 రోజులుగా మూతపడింది. ఆగస్టు 14 నుంచి ఉత్పత్తి ఆగిపోయి, ఆగస్టు 25 నాటికి తిరిగి ప్రారంభమైతాదని అంటున్నారు. ఇతర యూనిట్లు (తల్చేర్, నాగార్జున) కూడా తగినంత ఉత్పత్తి చేయడం లేదు.

అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు, రవాణా సమస్యలు, చైనా ఎగుమతుల నిషేధం వల్ల కూడా దిగుమతులు తగ్గాయి. తెలంగాణ రైతులు అధికంగా యూరియా వాడుతున్నారు. ఇది సహజ మృత్తికల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. 1970లలో ఎకరానికి ఒక బస్తా యూరియా వాడకం జరిగితే, ఇప్పుడు 10 బస్తాల వరకు వాడుతున్నారు. కౌలు రైతులు త్వరిత లాభాల కోసం ఎక్కువ యూరియా వాడడం వలన డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, పంపిణీలో లోటుపాట్లు, దిగుమతులపై ఆధారపడటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత సంక్షోభం ఆందోళనకర దశలో క్రమంలో రాజకీయ వర్గాలు తమ కనుకూలంగా మలుచుకో జూస్తున్నాయి. రైతులు సోషల్ మీడియాలో తమ సమస్యలను పంచుకుంటూ, యూరియా కొరత వల్ల పంటలు కోల్పోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతు స్వరాజ్య వేదిక, ఆల్ ఇండియా కిసాన్ సభ వంటి సంఘాలు నిరసనలు చేస్తూ, యూరియా సరఫరా పెంచాలని, బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ -ఆగస్టు 2025లో 3.20 ఎల్‌ఎంటి కొరత ఉందని, ఆర్‌ఎఫ్‌సిఎల్ వైఫల్యాన్ని వారు విమర్శిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి జెపి నడ్డా తగినంత యూరియా సరఫరా చేస్తున్నామని, రాష్ట్రం యూరియా అధిక వినియోగం, బ్లాక్ మార్కెటింగ్‌తోబాటు రాజకీయ ప్రయోజనాలకోసం సృష్టిస్తున్న కృత్రిమ సంక్షోభం కారణంగా రైతాంగంలో భయాందోళనలు పెరిగాయని వాదిస్తున్నారు.

యూరియా ద్వారా అన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందగలమనే భావనతో ఉన్నాయి. బిఆరెస్ నాయకులు కెటిరామారావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించిందని, బిఆర్‌ఎస్ హయాంలో ఇలాంటి సమస్యలు లేవని ఆరోపిస్తున్నారు. వ్యవసాయరంగ నిపుణులు మాత్రం యూరియా అపరిమిత వినియోగం ఆందోళన కలిగిస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం, మట్టి పరీక్షల ద్వారా ఎరువుల వాడకం తగ్గించాలని, ఇది మట్టి ఆరోగ్యాన్ని కాపాడుతుందని సూచిస్తున్నారు. ఆగస్టు 20, 2025 నాటికి, కేంద్రం అదనంగా 50,000 ఎంటి యూరియా సరఫరాకు ఆమోదం తెలిపింది. కర్ణాటక నుంచి 10,800 ఎంటి వచ్చిందని ప్రభుత్వం వివరిస్తున్నది.

నాలుగు విడుతలలో దిగుమతులు ఆగస్టు చివరి నాటికి రానున్నాయి. కానీ రాష్ట్రం మరో 80,000 ఎంటి కోసం కేంద్రాన్ని కోరుతున్నది. ఈ క్రమంలోనే ఆర్‌ఎఫ్‌సిఎల్ రిపేర్లు కొనసాగుతున్నాయి . తక్షణ చర్యలు: ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో యూరియా సరఫరా పెంచాల్సిన అవసరమున్నది. బ్లాక్ మార్కెటింగ్ ఆపడానికి కఠిన చర్యలు చేపట్టి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాల్సిన అవసరమున్నది. అలాగే యూరియా తక్షణ సరఫరా కోసం రైల్వే రవాణా, దిగుమతులను వేగవంతం చేయాలి. ఇవే కాకుండా భవిష్యత్తులో యూరియా వినియోగాన్ని నియంత్రించే చర్యలపై దృష్టి సారించాలి. రైతులకు యూరియా తక్కువ వాడేలా శిక్షణ ఇస్తూ నానో యూరియా, ఆర్గానిక్ ఎరువులను ప్రోత్సహించాలి.

ఎప్పటికప్పుడు మట్టి పరీక్షలను ప్రోత్సహించడం కూడా అవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటికి తోడు పరిశ్రమలకు యూరియా దుర్వినియోగాన్ని నిరోధించాలి. తెలంగాణలో యూరియా సంక్షోభం వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్ఫుటం చేస్తున్నది-. సబ్సిడీలపై ఆధారపడటం, అంతర్జాతీయ సరఫరా సమస్యలు, ప్రణాళికా లోపాలు కూడా ఈ సమస్యను భూతద్దంలో చూపుతున్నాయి. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించకపోతే, రైతులు కష్టాలు ఎదుర్కొంటారు. రానున్న రోజుల్లో ఆహార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. మెరుగైన సమన్వయం, స్మార్ట్ వ్యవసాయ పద్ధతులు తెలంగాణ వ్యవసాయానికి బలమైన భవిష్యత్తును నిర్మించేలా ప్రణాళికలు రూపొందించటం తక్షణావసరం.

  • పి.వి. కొండల్ రావు
    (జర్నలిస్టు)
  • వ్యవసాయ పరిశోధన స్టేషన్, వరంగల్లోని వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన వివరాల ఆధారంగా
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News