న్యూఢిల్లీ: భారత్, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బిటిఎ)పై చర్చలు జరుపుతోందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం అన్నారు. భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియా, యుఎఇ, మారిషస్, యుకె, నాలుగు యూరోపియన్ దేశాల బ్లాక్ ‘ఈఎఫ్టిఎ’లతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇండియా, అమెరికా మార్చి నుంచి చర్చలు జరుపుతున్నాయి, ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ముగిశాయి. కాగా ఆగస్టు 27న అమెరికా 50 శాతం సుంకం విధించాక, తదుపరి రౌండ్ చర్చలు జరిపేందుకు భారత్ రావలసిన అమెరికా బృందం దాన్ని వాయిదా వేసేసింది. వాస్తవానికి ఆ చర్చలు ఆగస్టు 25న జరగాల్సి ఉండింది.
ఇదిలావుండగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో ఇండియా తన వైఖరిలో దృఢంగా ఉంది. పైగా అమెరికా విధిస్తున్న సుంకాలు అన్యాయపూరితంగా ఉన్నాయని పేర్కొంటోంది. ఇండియా, యూరోపియన్ యూనియన్ 13వ రౌండ్ చర్చలు సెప్టెంబర్ 8న న్యూఢిల్లీలో జరుగనున్నాయి. ‘ఇండియా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం, చైనా, రష్యాల కన్నా ఇండియా విలువలు మాకే దగ్గరగా ఉంటాయి. మా మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటాం’ అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల ‘ఫాక్స్ న్యూస్’ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.