Wednesday, May 21, 2025

కిరానా హిల్స్‌లో అమెరికా అణుస్థావరం!

- Advertisement -
- Advertisement -

తాజాగా జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణలతో అర్ధాంతరంగా రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడం, ఈ ఘర్షణలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ వచ్చిన అమెరికా అధినేతలు అకస్మాత్తుగా తామే రెండు దేశాలను ఒప్పించి, కాల్పుల విరమణకు దోహదం చేశామని చెప్పుకోవడం, అయితే ఇందులో అమెరికా ప్రమేయం లేదని భారత్ పదేపదే స్పష్టం చేస్తూ రావడం గమనిస్తే తెరవెనుక చీకటి రహస్యాలు దాగి ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. ముందురోజు కూడా ఈ ఘర్షణ విషయంలో జోక్యం చేసుకోనని చెబుతూ వచ్చిన అమెరికా అంత అకస్మాత్తుగా ఎందుకు కాల్పుల విరమణ జరపాలని రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చింది? తన మాట వినకపోతే వాణిజ్య సంబంధాలు నిలిపివేస్తామని బెదిరించడంతో రెండు దేశాలు దారికి వచ్చాయని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇదే సమయంలో పాకిస్తాన్ అణుస్థావరం అని చెబుతున్న కిరానా హిల్స్ వద్ద భారత్ వైమానిక దళం క్షిపణులు ప్రయోగించడంతో అణుధార్మికత లీకేజీ జరగడంతో అమెరికా రంగంలోకి దిగి ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే, అక్కడ అణుస్థావరం ఉన్నట్లు తమకు తెలియదని, ఆ ప్రాంతంలో అసలు తాము క్షిపణులనే ప్రయోగించలేదని భారత వైమానిక దళాధికారి స్పష్టం చేశారు. కిరానా హిల్స్ లో ఎలాంటి లీకేజీ జరగలేదని ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎమర్జెన్సీ (ఐఎఇఎ) చెబుతోంది. అదే నిజమైతే, అణుధార్మికత లీకేజీ కాకుంటే అమెరికా నుంచి న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం ఎందుకొచ్చింది?
ఈజిప్టు నుంచి రేడియేషన్‌ను కట్టిడి చేయడానికి ఉపయోగించే బోరాన్తో మరో విమానం పాక్ గగనతలంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు కిరానా హిల్స్‌పై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ ఎందుకు మౌనం పాటిస్తోంది? దాయాది దేశం కిరానా హిల్స్ విషయంలో ఏమైనా దాచిపెడుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధమవుతుండగా, కట్టడి చేసేందుకు భారత్ క్షిపణి ప్రయోగించిందనే కథనాలు కూడా వెలువడ్డాయి. కాగా, అణుదాడుల గురించి దాయాది దేశం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా తేల్చి చెప్పారు.

కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేస్తున్నా కాల్పుల విరమణ జరిగిన వెంటనే పాకిస్తాన్ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది. కనీసం ఏడు సార్లు ఈ విషయమై ట్రంప్ తన వాదనను పునరుద్ఘాటిస్తూ వచ్చారు. ఈ విషయమై చర్చించేందుకు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, పార్లమెంటు సమావేశం జరపాలని ప్రతిపక్షాలు కోరినా ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ మొత్తం వివాదంలో ఒక విషయం స్పష్టం అవుతుంది. కిరానా హిల్స్ ప్రాంతంలో అణ్వస్త్రాల స్థావరం ఉందని, రెండు దేశాల ఘర్షణ ఆ ప్రాంతానికి ఎక్కడ విస్తరిస్తుందో అన్నభయంతోనే కాల్పుల విరమణ జరిగే విధంగా రెండు దేశాలకు నచ్చచెప్పే ప్రయత్నం అమెరికా చేసిందని భావించాల్సి వస్తుంది. ఆ ప్రయత్నం కూడా రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల మాదిరిగా సుదీర్ఘంగా చర్చలతో కాలయాపన చేయకుండా తక్షణమే అమలులోకి వచ్చే విధంగా ప్రయత్నం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది.
విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఈ ఘర్షణలతో జరిగిన దాడులు, నష్టాల వివరాల గురించి పలువురు ఎంపిలు ప్రశ్నించగా ‘జాతీయ భద్రత’ దృష్ట్యా అటువంటి వివరాలు వెల్లడించలేమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొనడం గమనార్హం.

ఏదేమైనా ఇటీవల చోటుచేసుకున్న భారత్ పాకిస్థాన్ ఘర్షణలకు సంబంధించి రెండు దేశాల సైనికాధికారులు వెల్లడిస్తున్న అంశాలకు మించిన అంశాలు ఇమిడి ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. పాకిస్థాన్ సర్గోదా జిల్లాలోని కిరానా హిల్స్‌లో అణు దాడులకు ఉపయోగించే టాక్టికల్ న్యూక్లియర్ వార్‌హెడ్‌లను ఉంచినట్లు ఈ సందర్భంగా వెలువడిన కథనాల పట్లనే మొత్తం ప్రపంచం నేడు దృష్టి సారిస్తోంది. దీనికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే ముసఫ్ ఎయిర్ బేస్ ఉంది. భారత్ దాడి చేసిన 11 ఎయిర్ బేస్‌లలో ఇది ఒకటి. ఇక్కడి నుంచి కిరానా హిల్స్‌కు కనెక్షన్ ఉందని అంటున్నారు. దీంతో ఇక్కడే వార్‌హెడ్లకు నష్టం జరిగి రేడియో యాక్టివ్ రిలీజ్ అయ్యి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక్కడే భారీ విధ్వంసం సృష్టించే అణు దాడులు చేసే స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్‌హెడ్లను పాక్ నిల్వచేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలవరించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అణుధార్మికత వెలువడి ఉండవచ్చన్నది ఆ కథనాల సారాంశం. అమెరికాకు చెందిన సిఐఎ మాజీ అధికారి డెరెక్ గ్రాస్మన్ కూడా ఈ వాదనను బలపర్చారు.

ఇదే సందర్భంలో పాకిస్తాన్‌లోని ఎయిర్ బేస్‌లపై భారత్ దాడి చేసిన తర్వాత అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ బి350 ఎంఎంఎస్ పాక్ గగనతలంలోకి వచ్చినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ విమానం ద్వారా రేడియోధార్మిక యాక్టివిటీని అంచనా వేస్తారు. అణు కర్మాగార ప్రమాదాల తర్వాత రేడియేషన్ లీక్‌లను పర్యవేక్షించడం, రేడియో లాజికల్ సంఘటనల సమయంలో అత్యవసర సేవలకు ఈ విమానాన్ని మోహరిస్తారు. ఈ పరిణామాలు అన్నింటిని లోతుగా విశ్లేషణ జరిపితే భారత్‌పై అణ్వస్త్రాలను ఉపయోగించే ప్రయత్నం పాకిస్తాన్ చేసిన దాఖలాలు కనిపించకపోయినా కిరానా హిల్స్ ప్రాంతంలో అణ్వాయుధ స్థావరం నెలకొన్నట్లు మాత్రం స్పష్టం అవుతుంది. అయితే, అమెరికా ఆదుర్దాగా ఈ విషయంలో స్పందించడం బట్టి చూస్తుంటే ఈ స్థావరం పాకిస్థాన్‌కు చెందింది కాకపోవచ్చని, అమెరికాకు సంబంధించినది కావచ్చనే అనుమానాలు బలంగా వ్యాపిస్తున్నాయి. కిరానా హిల్స్‌కు సంబంధించిన చిత్రాలను గూగుల్‌లో వెడల్పుగా చేసి చూస్తుంటే అక్కడ భూగర్భంలో భారీ స్థావరాలు ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఒక చిత్రంలో 2019 అక్టోబర్‌లో పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని అటువంటి అణు బంకర్లలో ఒకదానిలోకి ఏదో ఒకటి తీసుకువెళుతున్న దృశ్యం కనిపిస్తుంది.

సుమారు 150 విశాలమైన బంకర్లు ఉన్నట్లు, ఒకొక్క బంకర్ ద్వారమే 120 మీటర్ల వరకు ఉన్నట్లు చిత్రాలు కనిపిస్తున్నాయి. ఆ బంకర్లు బలమైన లోహాలతో తయారు చేసి ఉండవచ్చని, వాటిని ఇసుకతో కప్పి, చెట్లు వచ్చే విధంగా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో బహుశా మరెక్కడా ఇంతటి భారీ బంకర్లు, విశాలమైన ప్రాంగణాలలో సైనికులకు లేకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అంతటి భారీ బంకర్లను నిర్మించే సామర్థ్యం, ఆర్ధికంగా వెసులుబాటు పాకిస్తాన్‌కు ఉండే అవకాశం లేదని, అమెరికా స్వయంగా తన సైనిక ప్రయోజనాలకోసం నిర్మించుకొని ఉండవచ్చనే అనుమానాలు కూడా ఈ సందర్భంగా కలుగుతున్నాయి. పైగా, వ్యూహాత్మకంగా కిరానా హిల్స్ భౌగోళిక ప్రాంతం నెలకొన్న ప్రాధాన్యత కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అతి పెద్ద సైన్యం కలిగిన రష్యా, చైనా దేశాలు ఇక్కడకు సమీపంలో ఉన్నాయి. ఇక్కడి నుండి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలపై క్షిపణులు, అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు సౌలభ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ప్లూటోనియం డర్టీ బాంబులను ఉపయోగించి మొత్తం భారతదేశపు సామర్థ్యంపై రేడియేషన్ ప్రభావం కలిగించే అవకాశం ఉంటుంది. అంటే సగానికి పైగా ప్రపంచంపై సైనికంగా ఆధిపత్యం వహించేందుకు వ్యూహాత్మకంగా అనుకూలంగా ఉండే ప్రాంతంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

అందుకనే కిరానా హిల్స్‌లో అణ్వస్త్రాలు ఉన్నాయనే కథనాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ఈ కథనాలపై పాకిస్తాన్‌తో పాటు అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు సహితం మౌనం వహిస్తూ ఉండటం గమనార్హం. భారత్ కేవలం పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగించే ప్రయత్నం చేయలేదని మాత్రమే చెప్పింది గాని, అక్కడ అటువంటి ఆయుధాలు లేవని మాత్రం చెప్పడం లేదు. పైగా ఈ పరిణామాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ దేశంలోని అణ్వస్త్రాలను ఐఎఇఎ పర్యవేక్షణ కిందకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న దేశంలో అణ్వస్త్రాలు ప్రపంచ శాంతికి ప్రమాదకారి కాగలవని ఆయన హెచ్చరించారు. కానీ, ఆయన వ్యక్తం చేసిన ఆందోళనలపై పాకిస్తాన్ సైతం స్పందించే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయమై ఇప్పటి వరకు తాము అణ్వస్త్రం గల దేశం అంటూ భారత్‌ను బెదిరిస్తూ వస్తున్న పాకిస్తాన్ తాజా ఘటనలతో వాటిని నేలమట్టం చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందనే సంకేతం ఇచ్చినట్లయింది. పాకిస్తాన్‌కు అణుదాడి ఆలోచన వచ్చే లోపే ఆ స్థావరాలను నామరూపాల్లేకుండా చేస్తామన్న సంకేతాలను భారత్ ఇచ్చినట్టు కావడంతో భారత్ చేసిన ఈ హెచ్చరికను పాకిస్తాన్ బహిరంగంగా ఒప్పుకోలేక మౌనం పాటిస్తుందా? అనే అనుమానం కూడా కలుగుతోంది.
మరోవంక, తమ దేశ అణ్వస్త్రాలపై భారత్ దాడి చేసిందని ఒప్పుకుంటే అంతర్జాతీయ వేదికపై తమ పరువు పోతుందన్న ఆలోచనలో దాయాది దేశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఈ అంశంపై దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని పాకిస్తాన్ భయపడి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే, న్యూక్లియర్ వార్‌హెడ్స్ కూడా రక్షించుకోలేనంత శక్తిహీనంగా పాలకులు తయారయ్యారని స్వదేశంలోనే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దానితో కిరానా హిల్స్‌లో వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News