ట్రంప్ అధికార యంత్రాంగం వీసా గడువు కుదింపును తీవ్రతరం చేసింది. విదేశీ విద్యార్థులు, మీడియా సిబ్బంది వీసా కాల పరిమితిని మరింతగా తగ్గించేందుకు రంగం సిద్ధం అయింది. ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగు సంవత్సరాలు మించి అమెరికాలో ఉండరాదు. అదే విధంగా సాంస్కృతిక ప్రతినిధు వీసాలకు కూడా గడువు తగ్గుతుంది. ఈ తరహా వీసాదార్లు అమెరికాలో ఇంతకు ముందటితో పోలిస్తే తక్కువ సమయం ఉండాల్సి వస్తుంది.ఈ రెండు రకాల వీసాల గడువు కుదింపు నిర్ణయం ఖరారు అయిందని వీసా , ఇమిగ్రేషన్ వ్యవహారాల హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డిహెచ్‌ఎస్) పత్రికా ప్రకటన వెలువరించింది. ఇకపై స్టూడెంట్ వీసాదార్లు, మీడియా వారు పరిమిత సమయం వరకూ అమెరికాలో ఉండటానికి వీలుంటుందని అధికారిక ప్రకటనతో స్పష్టం అయింది. 1978 నుంచి ఎఫ్1 వీసా హోల్డర్లు అయిన విదేశీ విద్యార్థులు అమెరికాలో అనిర్ధేశిత సమయం వరకూ ఉండే వీలుంది. దీనిని డ్యూరేషన్ ఆఫ్ స్టే అని వ్యవహరిస్తారు.
ఈ హోదాతో ఉండే వారు ఇతర వీసాల మాదిరిగా కాకుండా , ఎంతకాలం అయినా ఎటువంటి తనిఖీలు ఇతరత్రా పరిశీలనలు లేకుండా అమెరికాలో ఉండవచ్చునని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇతరత్రా వీసాలు పొందిన విద్యార్థులు, మీడియా సిబ్బంది , అమెరికా ఔదార్యతను అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినంత కాలం తిష్టవేసుకుని ఉంటున్నట్లు తాము గుర్తించామని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు నిబంధనలలో మార్పులు తలపెట్టినట్లు వివరించారు. దీని వల్ల తలెత్తే భద్రతాపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇతర రకాల వీసాదార్లపై చెక్‌పెట్టినట్లు అధికారులు తెలిపారు. వీరి వైఖరి వల్ల అమెరికాలో పన్నుల చెల్లింపుదార్ల డాలర్లకు, అమెరికా పౌరులకు నష్టం వాటిల్లుతోందని , దీనిని గుర్తించి, సరైన విధంగా నియంత్రచేందుకు నిబంధనలను మార్చినట్లు తెలిపారు. ఇక విదేశీ మీడియా వారు ఇకపై 240 రోజుల వరకూ అమెరికాలో ఉండటానికి వీలేర్పడుతుంది. ఆంక్షల నేపథ్యంలో చైనా మీడియా ప్రతినిధులకు గడువులను మరింతా కుదించనున్నారు.