పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్, -హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ’ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను తాజాగా చిత్ర బృందం పూర్తి చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలు, యాక్షన్ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ ను రూపొందించారు.
ఈ చిత్రానికి ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచే ఈ అత్యంత పవర్ ఫుల్ సీక్వెన్స్ కు నబకాంత మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పవన్ కళ్యాణ్ యొక్క అత్యుత్తమ ప్రదర్శనతో ఈ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత, నబకాంత మాస్టర్ బృందానికి, ఫైటర్లు అందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్లైమాక్స్ సీక్వెన్స్ అద్భుతంగా రావడానికి కృషి చేసినందుకు వారిని అభినందించారు. ’ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం, నబకాంత మాస్టర్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.