పార్టీకి పునరుజ్జీవం పోయడానికే
బనకచర్లను ఎత్తుకున్న బిఆర్‌ఎస్
సహకరిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన
వివాద పరిష్కారానికి ఎందుకు
కృషి చేయడం లేదు? దింపుడుకళ్లం
ఆశలో బిఆర్‌ఎస్ నేతలు
కెసిఆర్, హరీశ్‌రావు చేసిన
సంతకాలే తెలంగాణకు మరణ
శాసనాలుగా మారాయి 299
టిఎంసిల కృష్ణాజలాలకు
అంగీకరించి తీరనిద్రోహం చేశారు
బనకచర్ల రాచపుండుకు వారిద్దరే
ఆద్యులు మాకు రాగిసంకటి,
చేపల పులుసు వద్దు తెలంగాణ
ప్రయోజనాలే ముఖ్యం బనకచర్లకు
పడింది తాత్కాలిక బ్రేకే రద్దు
చేసేంతవరకు కేంద్రంపై పోరాటం
బనకచర్లపై ప్రజాభవన్‌లో జరిగిన
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
అనంతరం ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు
బనకచర్లకు బ్రేక్ వేసిన ఘనత
మాదేనన్న నీటిపారుదల శాఖ
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు లేవని కేం ద్రం చెప్పడం తాత్కాలికమేనని, పునఃపరిశీలన తర్వాత మళ్లీ తెరపైకి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తమకు రాగి సంకటి, చేపల పులుసు వద్దు, తెలంగాణ ప్ర యోజనాలు ముఖ్యమన్నారు. బనకచర్ల ప్రాజెక్టు పై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రజా భవన్‌లో పవ ర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కా ర్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భం గా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు రాచపుండుకు ఆద్యుడు, బాధ్యుడు బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసి ఆర్, మాజీ మంత్రి హరీశ్ రావేనని ఆయన ధ్వ జమెత్తారు. పదేళ్ళ పాటు కెసిఆర్, హరీశ్ రావు నీటి పంపకాలను చూశారని ఆయన తెలిపారు.
బిఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణకు అన్యా యం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చే శారు. రెండు రోజులు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దామని, ఒక రోజు గోదావరి, రెం డో రోజు కృష్ణా నదీ జలాల వినియోగంపై చర్చిద్దామా? అని ఆయన కెసిఆర్‌ను, హరీష్ రావు ను ప్రశ్నించారు. బనకచర్లను భూతద్దంలో చూ పించి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు 299 టిఎంసిలు కేటాయించి, 68 ఆంధ్రకు కేటాయిస్తే కెసిఆర్, హరీ శ్ రావు అభ్యంతరం చెప్పలేదన్నారు. పైగా అందుకు సమ్మతి తెలియజేస్తూ సంతకాలు కూడా పెట్టారని ఆరోపించారు.ఎపిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇంత జరుగుతున్నా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మౌనంగా ఎందుకు ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఎందుకు చొరవ చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కెసిఆర్ నుంచి వస్తున్నవేనని ఆయన ఆరోపించారు. చచ్చిన బిఆర్‌ఎస్‌ను బతికించడానికి బిజెపి కుట్రలు పన్నుతుందని, దానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వివాదం విషయంలో కిషన్ రెడ్డి తమతో ఎందుకు కలిసి రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ వాదన అసంబద్దంగా ఉందని కిషన్ రెడ్డి ఎందుకు అనడం లేదని ఆయన నిలదీశారు. దీనిని బట్టి ఆయన తీరు అనుమానించాల్సి వస్తున్నదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన జలాల విషయంలో రాజీ పడేది లేదని, నీటి హక్కుల సాధనకు రాజకీయంగానే కాకుండా న్యాయ పోరాటమూ చేస్తామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మనుగడ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు మనుగడ గోదావరి నదీ జలాలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
౩ వేల టిఎంసిల వరద జలాలు ఉన్నాయని కెసిఆర్‌కు ఏ దేవుడు చెప్పారో కానీ చంద్రబాబు దీనిని ఆసరగా చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. గోదావరి బేసిన్‌లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాల లెక్క తేలుతుందని ఆయన తెలిపారు. కృష్ణా బేసిన్‌లో మనం కట్టుకునే ప్రాజెక్టులకు ఆంధ్ర ఎందుకు అభ్యంతరం చెబుతున్నదని ఆయన ప్రశ్నించారు. తమకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని ఆయన అన్నారు. కల్వకుర్తి, పాలమూరు, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బిసి, బీమా వంటి నిర్మాణాలను ఆనాటి ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో మనం 299 టిఎంసిల నీటిని వాడుకోలేకపోయామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే అన్యాయం జరిగిందని, ఈ దిశగా కేంద్రం కూడా ఆలోచన చేయలేదని ఆయన వివరించారు. పెద్దన్న పాత్ర పోషించి సమస్య పరిష్కరించాల్సిన కేంద్రం వివాదాలు సృష్టిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును కెసిఆర్ ధనదాహంతో రీ-డిజైన్ పేరిట అంచనాలు పెంచారని ఆయన విమర్శించారు.
బనకచర్ల నిలుపుదల విజయం మాదేనన్న ఉత్తమ్
బనకచర్ల నిలుపుదల విజయం తమదేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావర-బనకచర్ల లింక్ ప్రతిపాదనలు మొదలు పెట్టిందే గత ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్‌కు ఆహ్వానించి చర్చలు జరిపారని ఆయన గుర్తు చేశారు. లోగడ జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొన్నారని ఆయన తెలిపారు. గోదావరి జలాలు కృష్ణా, పెన్నా నదికి మళ్లించేందుకు జగన్‌తో చర్చలు జరిపిందే కేసిఆర్ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో ఎక్కడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ప్రసంగిస్తూ నదీ జలాల విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేసేది లేదని అన్నారు.