Monday, July 7, 2025

రైతులు బాగుంటే ఓర్వలేకపోతున్నారు.. హరీష్‌ రావుపై ఉత్తమ్‌ ఫైర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో రైతులు బాగుంటే బిఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిరంతరం రాష్ట్రంలో రైతులను మోసం చేయాలని, రైతులను ఆందోళనకు గురి చేయాలని బీఆర్‌ఎస్ కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ కుట్రపూరితమైన అబద్ధాలు ప్రచారాలు చేస్తోందని, రైతాంగం, ప్రజలు వారి చర్యలను గమనిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. పంటలు వేసేటప్పుడు రైతులను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ప్రతి పంట సీజన్‌లో రైతులను ఆందోళనకు గురి చేసి వారిని గందరగోళపరచాలనే దురాలోచన బీఆర్‌ఎస్ నేతలది అని ఆయన పేర్కొన్నారు. నిరుడు వానాకాలంతో పాటు ఇటీవలి యాసంగి సీజన్‌లో భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రైతాంగం రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేసిన విషయాన్ని మరిచిపోయి హరీష్‌రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవచేశారు.

దిగుబడిలో ముందంజ
గత వానాకాలంలో రాష్ట్రంలోని రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశ చరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాధించిన రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందనే విషయాన్ని బిఆర్‌ఎస్ నేతలు గుర్తించాలని సూచించారు.

వారి అసమర్ధత వల్లే మేడిగడ్డ కుంగింది
బీఆర్‌ఎస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలోనే ఉన్నాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. సీకెంట్ ఫైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పు బట్టిందన్నారు. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అదే సీకెంట్ ఫైల్స్ పౌండేషన్ టెక్నాలజీతో నిర్మించడంతో అవికూడా ప్రమాదకరంగా మారి అక్కరకు రాని పరిస్థితిలోనే ఉన్నట్లు వెల్లడించారు.

కల్వకుర్తిపై ఒకే విధానం
కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జులై చివరిలో లేదా ఆగస్ట్ ఒకటో తేదీన స్విచాన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారని, ఈసారి కూడా అదే విధానం అమలవుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అందులో రైతులు సందేహించాల్సిన అవసరం లేదన్నారు. రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలి ? ఎంత ఆయకట్టుకు ఇవ్వాలి ? ఈసారి ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ? అనేది ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

బిఆర్‌ఎస్ కుట్రలు బట్టబయలు
కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించటం వెనుక అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ ఇప్పటికే బయటపడ్డాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వారి హయంలోనే పోతిరెడ్డిపాడు కెపాసిటీ రెండింతలకు మించి 88వేల క్యూసెక్కులకు పెంచుకున్నారని, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్, ముచ్చుమర్రి నుంచి రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకునే కుట్రలకు బీఆర్‌ఎస్ దొంగచాటుగా సహకరించిందని ఆయన ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకపోగా, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1,225 టీఎంసీల నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు రికార్డులున్నాయని వివరించారు. నాడుబీఆర్‌ఎస్ పాలకులు తెలంగాణ ప్రయోజనాలను ఎలా తాకట్టుపెట్టారో తెలియజేసేందుకు ఇంతకు మించిన సాక్ష్యమేముంటుందని ఆయన ప్రశ్నించారు.

రైతన్నలకు ఆర్ధిక భరోసా
రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వటంతో సాగు విస్తీర్ణం పెరిగినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. పంటల దిగుబడి రికార్డు స్థాయికి ఎదిగిందని, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయని, అందుకే రైతు మేలు కోరే కార్యక్రమాలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పేందుకు గర్వపడుతున్నామన్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News