Sunday, August 31, 2025

లక్ష కోట్లు ఖర్చు చేసి.. లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) ప్రవేశపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.87,449 కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిరుపయోగంగా మారాయి. రూ.21 వేల కోట్లతో కట్టినవన్నీ 20 నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని గతంలో మూడు లేఖలు రాశారు. అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి రాష్ట్రానికి లేఖ రాశారు. ప్రాణహిత-చేవెళ్లకు తొలుత రూ.11,600 కోట్లు కావాలని కమిటీ చెప్పింది’’ అని అన్నారు.

అయితే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్లను అప్పటి సిఎం కెసిఆర్ మార్చారని కమిటీ చెప్పిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ‘‘మేడిగడ్డలో బ్యారేజ్ నిర్మించవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దని వ్యాప్కోస్ నిపుణులు కూడా చెప్పారు. వ్యాప్కోస్ డిపిఆర్ ఇవ్వకముందే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టాలని నిర్ణయించారు. కేబినెట్ అనుమతి లేకుండానే జివొ ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ ఖర్చులను భారీగా పెంచేశారు. బ్యారేజ్‌లకు జరిగిన నష్టం రాష్ట్రానికి పెనుభారంగా మారింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూ.38 వేల కోట్లతో పూర్తవ్వాల్సి ఉ్ంది. దాన్ని రూ.లక్షా 47 వేల కోట్లకు పెంచారు’’ అని ఉత్తమ్ (Uttamkumar Reddy) వివరించారు.

2019 నుంచి 2023 వరకు లిఫ్ట్ చేసినవి 162 టిఎంసిలు మాత్రమే అని ఉత్తమ్ తెలిపారు. ‘‘కాళేశ్వరం నుంచి ఏడాదికి 20.2 టిఎంసిలు మాత్రమే లిఫ్ట్ చేశారు. 34 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి విపత్తు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎన్‌డిఎస్ఎఫ్‌పై బిఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు బిఆర్ఎస్ మద్దతిచ్చింది. డ్యామ్‌కు, బ్యారేజ్‌కు తేడా లేకుండా పనులు చేశారని ఎన్‌డిఎస్‌ఎ నివేదికలో ఉంది. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారు’’ అని ఉత్తమ్ అన్నారు.

Also Read : రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్ లో ఉంది: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News