బాండా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాండా (Uttarpradesh Banda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో జరిగిన గొడవ కారణంగా ఓ మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని రాయ్‌సౌరా గ్రామానికి చెందిన రీనా.. తన భర్త అఖిలేష్‌తో శుక్రవారం రాత్రి గొడవ పడింది. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. నలుగురు ఇంట్లో కనిపించకపోవడంతో వాళ్ల కోసం వెతకడం ప్రారంభించారు. చివరకి గ్రామంలోని ఓ కాలువ ఒడ్డున వాళ్లకి సంబంధించిన బట్టలు, గాజులు, బ్రేస్‌లెట్‌లు, చెప్పులు ఇతర వస్తువులు దొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈతగాళ్ల సాయంతో కాలువలో వెతికించారు. అందులో నుంచి నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు రీనా, హిమాన్షు (9), అన్షి (5), ప్రిన్స్(3)గా గుర్తించారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాండా (Uttarpradesh Banda) ఎస్పి మాట్లాడుతూ.. ‘కాలువలో నీటి ప్రవాహం తగ్గించి, ఈతగాళ్లతో వెతికించాము. ఐదు నుంచి ఆరు గంటల తర్వాత మహిళతో పాటు ముగ్గురి మృతదేహాలు లభించాయి. నలుగరి మృతదేహాలు ఓ బట్టతో కట్టేసి ఉన్నాయి. భర్తతో గొడవ కారణంగానే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది’’ అని అన్నారు. మహిళ భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.