తిరువనంతపురం: కేరళ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ కమ్యూనిస్ట్ నేత, మాజీ సిఎం వెలిక్కకట్టు శంకరన్ అచ్యుతానందన్ (V.S.Achuthanandan) కన్నుమూశారు. 101 ఏళ్ల అచ్యుతానందన్ వయస్సు భారంతో అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. సోమవారం ఆయన చికిత్స పొందుతూ తుద శ్వాస విడిచారు. 1923లో జన్మించిన అచ్యుతానందన్, సిపిఐఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1940లో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1964లో సిపిఎం నుంచి బయటకు వచ్చారు.
ఆ తర్వాత సిపిఐ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1985లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగా (V.S.Achuthanandan) సేవలు అందించారు. 2016 నుంచి ఆరోగ్య సమస్యలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో ఉంటూనే ఆయన పలు ఉద్యమాలు కూడా చేశారు. పున్నప్ర-వయలార్ ఉద్యమం, మునార్ భూసేకరణ, లాటరీ మాఫియాపై పోరాటం, ఫిల్మ్ పైరసీపై ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఉద్యమాల కారణంగా 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష, 4.5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్నారు.
అచ్యుతానందన్ మరణంతో రాష్ట్రం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని రాష్ట్ర రాజకీయ ప్రముఖులు అన్నారు. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.