కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ (101) సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు కన్నుమూశారు. గతనెల 23న గుండెపోటుతో పట్టొం ఎస్‌యుటి ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) సంస్థాపక సభ్యుడైన అచ్యుతానందన్ జీవితాంతం కార్మికుల హక్కులు, భూసంస్కరణలు, సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం సాగించారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర అసెంబ్లీకి ఏడుసార్లు ఎన్నికయ్యారు. అసెంబ్లీ విపక్ష నాయకునిగా మూడు సార్లు పనిచేశారు.
ఆస్పత్రి వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవందన్ విలేకరులతో మాట్లాడుతూ అచ్యుతానందన్ భౌతిక కాయం తిరువనంతపురం ఎకెజి స్టడీ అండ్ రీసెర్చి సెంటర్ కు తరలించిన తరువాత పార్టీ కార్యకర్తలు, ప్రజలు నివాళులర్పిస్తారని చెప్పారు. మంగళవారం ఉదయం దర్బార్‌హాలులో ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచుతారని, ఆ తరువాత ఆయన స్వస్థలం అలప్పుఝాకు మంగళవారం మధ్యాహ్నం తరలిస్తారని చెప్పారు. అలప్పుఝా జిల్లా ప్రధాన కేంద్రం వద్ద కొంతసేపు ఉంచిన తరువాత బుధవారం మధ్యాహ్నం అలప్పుఝా వలియా చుడుకాడు వద్ద ప్రజా స్శశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. సోమవారం ఉదయం అచ్యుతానందన్ ఆరోగ్యం క్షీణించిందని తెలియడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్, సిపిఎం నాయకులు ఆస్పత్రికి వెళ్లి సందర్శించారు.
అచ్యుతానందన్ జీవిత విశేషాలు
అలప్పుఝా జిల్లా పున్నప్ర గ్రామంలో 1923 అక్టోబర్ 20న అచ్యుతానందన్ జన్మించారు.బాల్యమంతా పేదరికంతో అష్టకష్టాలతో గడిచింది. నాలుగేళ్ల వయసు లోనే తల్లి చనిపోయింది. స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. దాంతో చదువుకు ఏడవ తరగతిలో స్వస్తి చెప్పి దర్జీ దుకాణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పనిచేస్తూ కార్మిక ఉద్యమం లోకి అడుగుపెట్టారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పి. క్రిష్ణపిళ్లై స్ఫూర్తితో 1940 లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1943లో కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో అలప్పుఝాకు ప్రాతినిధ్యం వహించారు. 1946 లో పున్నప్రవాయలార్ తిరుగుబాటులో అజ్ఞాత జీవితం గడిపారు. తరువాత అరెస్టు అయి పోలీసుల లాఠీ దెబ్బలకు గురై య్యారు. చనిపోయాడనుకొని సమాధి చేద్దామనుకున్న సమయంలో ఇంకా బతికి ఉన్నాడని తెలిసి ఆస్పత్రికి తరలించారు. 1946 తిరుగుబాటులో తీవ్ర చిత్రహింసలకు గురైనప్పటికీ, రాజకీయ కార్యకలాపాలు విడిచిపెట్టలేదు.
1956లో పార్టీ రాష్ట్ర కమిటీలో చేరి, క్రమంగా జాతీయ స్థాయి పదవుల్లో రాణించారు. 1985లో పొలిట్‌బ్యూరోలో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో వెనుకంజ వేయని అచ్యుతానందన్ , రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపైనా ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మోపారు. ప్రజలు, పార్టీ మధ్య అంతరం వచ్చినప్పుడు మార్కిస్టు పార్టీ క్రమశిక్షణనూ పక్కనపెట్టి ప్రజల పక్షాన నిలబడడానికే పెద్ద పీట వేశారు. ఆధునిక అవసరాలను కూడా అర్థం చేసుకున్న నిత్య అధ్యయనశీలి. పాతతరంలో భూమి కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైనట్టుగా, సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించి, అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కోసం ఉద్యమించారు.