అనారోగ్యంతో బాధపడుతూ
కన్నుమూత కోటి మొక్కలు
నాటి ఆదర్శప్రాయుడిగా నిలిచిన
రామయ్య పద్మశ్రీ బిరుదుతో
సత్కరించిన కేంద్ర ప్రభుత్వం
రెండు రాష్ట్రాల్లోని పాఠ్యపుస్తకాల్లో
ఆయన జీవిత చరిత్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా
పలువురి సంతాపం
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య (87) శనివారం మృతి చెందారు. ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపల్ పరిధిలో గల రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున ఇంటి వద్ద తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి 2017లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన మొక్కల పేర్లను వనజీవిగా మార్చుకున్నారు. తన నలుగురు మనుమళ్లు, మనుమరాళ్లకు చందనపుష్ప, హరితలావణ్య, కబంధపుష్ప,
వనశ్రీ అని చెట్ల పేర్లను పెట్టుకున్నారు. తన తుది శ్వాస విడిచేంత వరకు మొక్కలు నాటడం, విత్తనాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. సామాజిక సేవను గుర్తించి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో పొందుపరిచారు. అందుకు తగ్గట్టుగానే ఆయన సైతం కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య మృతి చెందడం పట్ల జిల్లాకు చెందిన డిప్యూటీ సిఎంలు మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామయ్య నేపథ్యం…
ముత్తగూడెం గ్రామానికి చెందిన వనజీవి రామయ్యకు రెడ్డిపల్లిలో పొలం ఉండటంతో ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. 1937 జూలై 1 తేదీన లాలయ్య, పుల్లమ్మ దంపతులకు ఆయన జన్మించారు. అసలు పేరు రామయ్య కాగా…మొక్కలు నాటడమే జీవితాశయంగా మలుచుకొని ఇంటిపేరును వనజీవి రామయ్యగా మార్చుకున్నారు. ముత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు ఆయన చదువుకున్నారు. అటు తర్వాత 15 సంవత్సరాలకు కుటుంబ సభ్యులు కొణిజర్ల మండలం, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జానమ్మతో అతనికి వివాహం జరిపించారు. వీరికి నలుగురు సంతానం..ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె, ఇందులో ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఓ పక్క కుటుంబభారాన్ని మోస్తునే తనకెంతో ఇష్టమైన మొక్కలను నాటేవారు.
రామయ్యను వరించిన అవార్డులు..
రామయ్య సామాజిక సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర, యూనివర్సల్ గ్లోబల్ షిప్ అంతర్జాతీయ సంస్థ నుండి గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు, 2000లో అప్పటి సిఎం నారచంద్రబాబు నాయుడు వనజీవి సేవలకుగాను ఒక మోషెట్‌ను కొనిచ్చారు. ప్రతి నెల రూ.1500 గౌరవ భృతిని కేటాయించారు.